
విశాఖ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీ కోసం కొంతమంది పరుగులు పెడుతూంటే పోటీ చేయనని మరికొంతమంది పేచీ పెడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీకి నో అంటున్నారు. అయితే చంద్రబాబు క్లాస్ తీసుకోవడంతో ఆయన దారికి వచ్చేశారు. ఇక టీడీపీలో రేపో మాపో చేరుతున్న కొణతాల రామకృష్ణ తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయానని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. దీనికి కారణాలు తెలియక టీడీపీ హై కమాండ్ తలలు పట్టుకుంటోంది. అసలు కొణతాల పార్టీలో ఎందుకు చేరుతున్నట్లో అన్న చర్చ కూడా ఇపుడు వస్తోంది.
అపనమ్మకమా…:?
నిజానికి కొణతాలకు ఒకప్పటి బలం ఇపుడు లేదు. సొంతమనుకున్న క్యాడర్ ఎపుడో చెల్లాచెదురైపోయింది. దాంతో కొణతాల ఉత్తారాంధ్ర సమస్యల మీద పోరాటం అంటూ కొంతకాలంగా మళ్ళీ జనంలో కనిపిస్తున్నారు. ఇక ఆయన టీడీపీ, వైసీపీలలో ఏదో పార్టీలో చేరుతారని చాలాకాలంగా వినిపించింది. చివరకు ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిధ్ధపడ్డారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో ఆయన పసుపు పార్టీలో లాంచనంగా చేరబోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీకి ససేమిరా అనడమే విశేషం. పోటీ చేస్తే ఓడిపోతానని అనుమానాలు ఆయనకు ఉన్నాయని, అందుకే వద్దంటున్నారని చెబుతున్నారు. కొణతాల రాక పట్ల టీడీపీలో చాలామందికి ఇష్టం లేదు. దాంతో క్రాస్ ఓటింగ్ చేస్తారేమోనని డౌట్ మాజీ మంత్రి గారికి ముందే వచ్చిందని అంటున్నారు. అదే విధంగా తాను కోరుకున్నట్లుగా అసెంబ్లీ సీటు ఇవ్వలేదన్న అసంతృప్తి కూడా కొణతాలకు ఉందని అంటున్నారు.
వియ్యంకుడి కోసమా….?
ఇక ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. కొణతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన వియ్యంకుడు, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీలా గోవింద సత్యనారాయణకు టికెట్ లేకుండా చేయాలన్న ప్లాన్ ఉంది. దాంతో పిల్లను ఇచ్చుకున్న వియ్యంకుడి సీటుకు ఎసరు పెడితే అది కుటుంబంలోనే రాజకీయ తుపాను కి దారి తీస్తుందని తెలివిగా ఆలోచించిన మీదటనే కొణతాల నో చెప్పారన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఎలా చూసుకున్నా మాజీ మంత్రి గారు ఈసారికి పోటీలో ఉండరన్నది నిజం. అంతే కాదు. ఆయన 2014 ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆనాడు కూడా వైసీపీ కోరుకున్న సీటు ఇస్తామని చెప్పినా కూడా కొణతాల వద్దని చెప్పేసి తన తమ్ముడుకు వైసీపీ సీటు ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే 2009లోనే కొణతాల చివరిసారిగా పోటీ చేయడం జరిగింది.
Leave a Reply