
కొణతాల రామకృష్ణ చేజేతలా రాజకీయ జీవితానికి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారా? ఏ పార్టీలో చేరకుండా చివరి నిమిషంలో జాయిన్ అయితే టిక్కెట్ వస్తుందని ఆశించి ఆయన భంగపడ్డారా? సీనియర్ రాజకీయ నేతకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠమే చెప్పాయంటున్నాయి. ఇదివరకటిలాగా ఎన్నికలు లేవు. లీడర్లు లేరు. ఇప్పుడంతా ఇన్ స్టంట్ పాలిటిక్స్. దాన్ని నమ్ముకునే కొణతాల తన రాజకీయ ప్రస్థానానికి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారంటున్నారు. మళ్లీ ఐదేళ్ల పాటు ఎదురు చూపులు చూడటం తప్ప ఆయనకు మరో దారిలేదన్నది వాస్తవం. ఏ పార్టీలో చేరినా ఇప్పట్లో పదవులు లభించే అవకాశాలూ లేవు.
ఐదేళ్ల నుంచి….
కొణతాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. సొంతంగా ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక వేదికను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ స్లోగన్ అందుకుని వెళ్లారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూనే భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర సమస్యలపై విశాఖ నుంచి ఢిల్లీ వరకూ రైలు యాత్ర చేశారు.
అతి విశ్వాసానికి వెళ్లే….
అయితే కొణతాల ఐదేళ్ల పాటు ఏరాజకీయ పార్టీలో చేరలేదు. తనను పిలిచి పార్టీలు టిక్కెట్లు ఇస్తాయని ఆయన అతి విశ్వాసానికి పోయినట్లుంది. అందుకే ఆయన అన్ని పార్టీలతో సఖ్యతగానే మెలిగారు. అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఉత్తరాంధ్ర సమస్యలను మ్యానిఫేస్టోలో పెట్టాలని వినతులు అందజేసి వచ్చారు. చివరి నిమిషంలో అనుచరుల వత్తిడి మేరకు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ అధినేత జగన్ వద్దకు వెళ్లి మరీ కలసి పార్టీలో చేరకుండా వెనుదిరిగారు. జగన్ నుంచి సరైన స్పందన రాకపోవడం వల్లనే కొణతాల కండువా కప్పుకోలేదన్న వార్తలు వచ్చాయి.
రెండే మార్గాలు….
ఇక పెద్దగా టైం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ వైపు కూడా కొణతాల చూశారు.అక్కడి నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. అంతేకాకుండా కొణతాల రాకను విశాఖలోని టీడీపీ నేతలు వ్యతిరేకించడం కూడా ఆయనవైపు చంద్రబాబు పెద్దగా మొగ్గు చూపకపోవడానికి కారణంగా చెబుతారు. టీడీపీ, వైసీపీ టిక్కెట్లన్నీ ఖరారయిపోయాయి. ఇక కొణతాల ముందున్నది ఒకటేమార్గం. మళ్లీ ఐదేళ్ల పాటు వెయిట్ చేయడం. లేకుంటే ఏదో ఒక పార్టీలో చేరి దానికి ఈ ఎన్నికల్లో మద్దతు పలికి పదవి పొందడం. అంతే తప్ప ఆయనకు మరో మార్గం లేదు. కొణతాల టీడీపీలో చేరతారన్న వార్తలు మళ్లీ హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోచూడాలి. సీనియర్ నేతగా ఉన్న కొణతాల అతి విశ్వాసమేకొంపముంచిందన్నది కాదనలేని వాస్తవం.
Leave a Reply