
కర్నూలు జిల్లాలో పేరున్న నేత ఆయన. ఆయన కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. అటువంటి ఆ నాయకుడు ఇప్పుడు దిక్కులు చూస్తున్నట్లు కన్పిస్తోంది. ఆయనే మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. గత కొద్ది నెలలుగా ఆయన కన్పించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తర్వాత పెద్దగా ప్రజల్లో తిరగడం లేదు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నట్లు? కాంగ్రెస్ లో ఉన్నట్లా? లేనట్లా? ఆయన పార్టీ మారుతున్నారా? ఏ పార్టీలోకి? వైసీపీలోకా? టీడీపీలోకా? ఇదీ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
పట్టున్న కుటుంబం కావడంతో…..
కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీకి పట్టుంది. దీంతో ఆయన వస్తే ఏ పార్టీ అయినే రెడ్ కార్పెట్ పరుస్తుంది. తొలిరోజుల్లో కోట్ల వైసీపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని వీడి కోట్ల వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అది జరగలేదు. తర్వాత కొద్ది రోజులకు కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందన్న ప్రచారమూ అంతేస్థాయిలో జరిగింది. తమ కుటుంబంలోని వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లడంతో ఈ అనుమానం మరింత బలపడింది. అయితే కోట్ల రాకను కేఈ కుటుంబం వ్యతిరేకిస్తుందన్న వార్తలూ అప్పట్లో వచ్చాయి.
టీడీపీలో చేరతారని…..
కేఈ కుటుంబాన్ని సంతృప్తి పర్చేందుకే కేఈ ప్రభాకర్ కు కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని, ఇక కోట్ల రాకకు మార్గం సుగమమం అయిందని కూడా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళతారని అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాని చంద్రబాబు వెళ్లలేదు. ఇప్పటి వరకూ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరలేదు. ఇప్పుడు టీడీపీలో కోట్ల ఊసే విన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో కోట్ల తర్వాత స్టెప్ ఏంటన్న చర్చకర్నూలు జిల్లాలో జరుగుతోంది.
ఏపార్టలోకి….
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండటంతో కోట్ల పయనమెటు? అన్న అంశం ఆసక్తిగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఢిల్లీలో సయితం పెద్దగా కన్పించడం లేదు. అయితే రోజురోజుకూ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోట్ల కుటుంబం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి కోట్ల కుటుంబం వైసీపీలో చేరుతుందా….? లేక అధికార టీడీపీలో చేరుతుందా అలాీ కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతుందా? అన్నది వేచిచూడాల్సింది.
Leave a Reply