
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కర్నూలు జిల్లాలో బలమైన నేత. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. అయితే ఇప్పుడు కోట్ల ఏం చేస్తున్నారు. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో తన సొంత భూముల్లో వ్యవసాయం చూసుకుంటున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలో చేరతారని కొన్నాళ్లు, తెలుగుదేశం పార్టీలోకి కోట్ల కుటుంబం వెళుతుందని మరికొన్నాళ్లు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే కోట్ల మాత్రం పార్టీ మారడంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో…..
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కన్పించారు. ఆ తర్వాత మళ్లీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా కోట్ల కుటుంబం పెద్దగా ఉత్సాహం చూపడం లేదని తెలుస్తోంది. కోట్ల కుమారుడితో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు సన్నిహిత సంబంధాలుండటంతో సైకిల్ సవారీ చేస్తారనుకున్నారు. కాని కోట్ల మాత్రం పార్టీ మారే విషయంపై ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అయితే కోట్ల లాంటి బలమైన నాయకుడి కోసం ఏపీలోని రెండు పార్టీలూ ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాయి.
వైసీపీ ప్రయత్నాలు….
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా ఇటీవల తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే చెబుతున్నారు. కోట్లతో నేరుగా మాట్లాడకున్నప్పటికీ ఆయన సన్నిహితులతో సీనియర్ నేతలు చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు పార్లమెంటు స్థానం, ఆయన సతీమణి సుజాతమ్మకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తామని, పార్టీలోకి వచ్చేలా చూడాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వైసీపీలో చేరేందుకు కోట్ల పెద్దగా ఇష్టపడటం లేదని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ ఆయన ఎందుకో ఆ పార్టీ పట్ల అంత సుముఖంగా లేరని చెబుతున్నారు.
కోట్ల మాత్రం…..
అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లాలోని పార్టీలో తలెత్తిన విభేదాల సమయంలో ఇన్ ఛార్జి మంత్రితో చర్చించిన చంద్రబాబు కోట్ల విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. కోట్ల కుటుంబం పార్టీలోకి వస్తే ఇమేజ్ పెరగడమే కాకుండా రెండు, మూడు నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుందని, ఎంపీ స్థానాన్ని కూడా సులువుగా చేజిక్కించుకోవచ్చని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇందుకు ఇన్ ఛార్జి మంత్రికే బాధ్యతలను అప్పగించారని చెబుతున్నారు. కాని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కు అవకాశం లేకపోయినా, మోడీ ఇమేజ్ పడిపోవడం, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆ పార్టీలోనే ఉంటే బెటరన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కోట్ల నుంచి క్లారిటీ కోసం రెండు పార్టీలూ ఆశగా ఎదురు చూస్తున్నాయి. కాని ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లోనేకంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి.
Leave a Reply