కోట్ల కుటుంబం అలా చేస్తుందా…?

కోట్ల ఫ్యామిలీ అంటేనే కర్నూలు జిల్లాలో పెట్టింది పేరు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి ఆయన కుటుంబంపై కర్నూలు జిల్లాలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోట్ల ఫ్యామిలీ పార్టీ మారుతుందన్న ఊహాగానాలు గతంలో వచ్చాయి. వైసీపీలోకి వెళతారని కొన్ని రోజులు, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని మరికొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. కోట్ల ఫ్యామిలీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలవడం కూడా ఈ ప్రచారానికి అప్పట్లో ప్రాధాన్యత లభించింది.

కాంగ్రెస్ లోనే కోట్ల కుటుంబం….

అయితే కోట్ల కుటుంబం మాత్రం కాంగ్రెస్ ను వీడి వెళ్లలేదు. ఇటీవల కర్నూలులో జరిగిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభకు కూడా జనసమీకరణ చేసింది కోట్ల కుటుంబమే. ఇక ఆయన పార్టీ మారరన్నది ఖాయమయింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మ కూడా అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి రెడీ అయిపోయారు. ఈసారి కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు కూడా.

డోన్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంపై…..

అయితే ఇప్పుడు కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఆమె ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి డోన్ ను ఎంచుకోవడం వెనక వ్యూహం ఉందంటున్నారు వైసీపీ నేతలు. నిజానికి 1994 ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి డోన నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు 37 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కేఈ ప్రభాకర్ గెలుపొందడం విశేషం. తర్వాత 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో అదే నియోజవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలలో కోట్ల సుజాతమ్మ ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

తమను ఓడించేందుకే…..

కోట్ల కుటుంబం తమను ఓడించాలన్న ఉద్దేశ్యంతోనే డోన్ నియోజకవర్గాన్ని ఎంచుకుందన్నది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కోట్ల ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. కనీసం తెలుగుదేశం పార్టీని పన్నెత్తు మాట అనడం లేదన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఓట్లను చీల్చి వైసీపీని డోన్ లో ఓడించాలన్న లక్ష్యంతోనే సుజాతమ్మ పనిచేస్తున్నారని సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తుంటే, నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్న డోన్ నియోజకవర్గాన్ని కోట్ల సుజాతమ్మ ఎందుకు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడ నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. గత ఎన్నికలలో కోట్ల ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి సహకరించిందన్నారు. అయినా తమ గెలుపును అడ్డుకోలేకపోయారని బుగ్గన చెప్పారు. మొత్తం మీద కోట్ల ఫ్యామిలీ కేవలం జగన్ ను టార్గెట్ చేయడం వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని వైసీపీ అనుమానిస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 32628 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*