
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. ఆయన టీడీపీలో చేరితే ఏసీట్లు ఆఫర్ చేస్తారన్నది ఇప్పడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకను నొప్పించకుండా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. కోట్ల చేరితే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు కోట్ల సతీమణి సుజాతమ్మకు అసెంబ్లీ సీటును కేటాయించాల్సి ఉంటుంది.
కేఈ ఫ్యామిలీని…
వీరిని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది ఇటు కేఈ ఫ్యామిలీలోనూ, ఇటు బుట్టా రేణుక వర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు పార్లమెంటు స్థానం ఇవ్వడం దాదాపు ఖాయం. ఇందులో మరో అనుమానానికి సందేహం లేదు. అప్పుడు బుట్టా రేణుకను ఏం చేస్తారు? అన్నది చర్చగా మారింది. బుట్టా రేణుకను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అధినేత భావిస్తున్నారట. బుట్టా రేణుక కూడా వైసీపీని వీడింది అందుకే కావడంతో ఆమె అభిలాషను కూడా తీర్చినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
బుట్టారేణుక అంగీకరిస్తారా?
బుట్టారేణుకను పాణ్యం నియోజక వర్గం నుంచి పోటీచేయించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాణ్యంలో బలమైన వైసీపీ నేతలు ఉన్నారు. ఇటు గౌరు చరితా రెడ్డి మాత్రమే కాకుండా కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. వారిద్దరూ ఒకే పార్టీలో ఉంటే బుట్టారేణుక పాణ్యం నుంచి విజయం సాధించడం కష్టమేనన్నది అందరికీ తెలిసిందే. ఈ ప్రతిపాదనకు బుట్టా అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇక కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీకి కూడా రెండు టిక్కెట్లు అడుగుతున్నారు. ఒకటి పత్తికొండ నియోజకవర్గం కాగా, మరోది డోన్ నియోజకవర్గం.
కోట్ల సుజాతమ్మకు….
పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు పోటీ చేస్తారని, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీకి దిగుతారని కేఈ వర్గం బాహాటంగానే చెబుతోంది. కోట్ల సుజాతమ్మకు వాస్తవానికి డోన్ నియోజకవర్గం కేటాయించాల్సి ఉంది. అయితే కోట్ల సుజాతమ్మకు ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అప్పుడు కేఈ ఫ్యామిలీకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన మధ్యేమార్గంగా ఈ ఆలోచన చేశారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కేఈ ఫ్యామిలీని దూరం చేసుకునే సాహసాన్ని చంద్రబాబు ఎన్నికల ముందు చేయరని, అందుకే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ను ఆఫర్ చేశారంటున్నారు.
Leave a Reply