
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆయన అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో చేరి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా బరిలోకి దిగితే ఆ ప్రభావం ఏ ఏ నియోజకర్గాలపై ఉంటుంది? ఏ ఏ నియోజకవర్గాల్లో కోట్లకు బలమైన ఓటు బ్యాంకు ఉంది…? కోట్లకు ధీటైన అభ్యర్థి ఎవరు? అన్నది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కోట్ల ఫ్యామిలీకి….
తెలుగుదేశం పార్టీలో కోట్ల చేరిక దాదాపుగా ఖాయమైపోయింది. కర్నూలు పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో ఈ స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇప్పటి వకూ 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు గెలుపొందారంటే కోట్ల కుటుంబానికి ఈ నియోజకవర్గంతో ఎంతటి అనుబంధం ఉందో ఇట్టే చెప్పొచ్చు. 2004, 2009లో కూడా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంటుకు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు, మంత్రాలయం నియోజకవర్గాలు వచ్చి చేరాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించడం గమనార్హం.
శాసనసభ స్థానాల్లో…..
కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో బలాబలాలను పరిశీలిస్తే ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ వంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఇక మంత్రాలయం, ఆదోని, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. కోట్ల చేరికతో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా తాము పాగా వేస్తామని టీడీపీ భావిస్తోంది. అయితే వైసీపీ వాదన ఇందుకు విరుద్ధంగా ఉంది. కోట్లకు ధీటుగా బలహీన వర్గాల అభ్యర్థినే బరిలోకి దింపుతామని వైసీపీ చెబుతోంది. గత ఎన్నికలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గానికి చెందిన బుట్టారేణుకకు ఇక్కడ టిక్కెట్ ఇచ్చింది. ఇదే తరహాలో మళ్లీ బీసీ వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
బలహీన వర్గాల అభ్యర్థినే…..
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణను ప్రారంభించింది. అయితే ఇక్కడ ఇప్పటికే కర్నూలు పార్లమెంటు ఇన్ ఛార్జి బీవై రామయ్యను బరిలోకి దింపాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీవై రామయ్య బలహీన వర్గాలకు చెందిన నేత కావడంతో ఆయనవైపే కర్నూలు జిల్లా పార్టీ నేతలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో బీసీ వర్గాల ఓటు బ్యాంకు అధికం కావడం, నియోజకవర్గాల్లో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉందని, ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి ఎవరైనా కోట్లను ఓడించి తీరుతారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి కోట్లకు సరైన అభ్యర్థిని బీవై రామయ్యనే ప్రకటిస్తారా? చివరి నిమిషంలో ఛేంజ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Leave a Reply