
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి నేతలు గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికూడా డోన్ నుంచి 1962లో విజయం సాధించారు. ఇక 1978 నుంచి 1999 వరకూ డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో డోన్ టిక్కెట్ ఎవరికిస్తారన్న చర్చపార్టీలో ఆసక్తికరంగా జరుగుతోంది. కోట్ల, కేఈలలో ఎవరిది పైచేయి అవుతుందోనన్న ఉత్కంఠ కూడా లేకపోలేదు.
కోట్ల, కేఈ కుటుంబాలకు…..
డోన్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గెలుపొందారు. ఆయన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ ను ఓడించగలిగారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలతో పాటుగా పాణ్యం మండలంలోని మూడు గ్రామాలు, డోన్ లోని 13 గ్రామాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. కేఈ కృష్ణమూర్తి ఇక్కడి నుంచినాలుగు సార్లు గెలుపొందారు. ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ 1999లో డోన్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత కోట్ల ఫ్యామిలీ ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. 2004లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మ డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో అదే డోన్ నుంచి కేఈ కృస్ణమూర్తి విజయం సాధించారు.
కోట్ల డిమాండ్లు ఇవే…..
అయితే కోట్ల కుటుంబం ఈ నెల 28వ తేదీన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం, కోట్ల సుజాతమ్మకు డోన్ నియోజకవర్గం కేటాయించాలని ఆ ఫ్యామిలీ నుంచి చంద్రబాబు వద్దకు ప్రతిపాదన వెళ్లిందని తెలుస్తోంది.అయితే రెండు రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశమైన కేఈ కృష్ణమూర్తి తమ కుటుంబం డోన్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పారట. కోట్ల సుజాతమ్మకు ఆలూరు గాని కర్నూలు టౌన్ గాని ఇస్తే బాగుంటుందని కేఈ సూచన కూడా చేశారని తెలిసింది.
కేఈ వదులుకుంటారా?
దీంతో డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. డోన్ లో తమకు పట్టుందని కోట్ల వర్గం, తమ నియోజకవర్గమని కేఈ గ్రూపులు గట్టిగా తలపడుతుండటంతో చంద్రబాబుకు తలపోటుగా మారింది. ఇప్పటికే కేఈ సోదరులకు మంత్రి పదవితో పాటు మరోసోదరుడు ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇదే డోన్ నియోజకవర్గంలో వారికి అడ్డంకిగా మారనుందన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. మరి చంద్రబాబు కోట్లకు కొమ్ముకాస్తారా? లేక కేఈ పక్షాన నిలబడతారా? అన్నది తేలాల్సి ఉంది.
Leave a Reply