కుమార పట్టు అక్కడే ఉందా?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ రాష్ట్ర నేతలను లైట్ గా తీసుకుంటున్నారు. తాను అనుకున్నది చేయాలంటే రాహుల్ చెవిలో ఊదాలని నిర్ణయించుకున్నట్లుంది కుమారస్వామి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణలో అసమ్మతులతో తలనొప్పిగా ఉన్న కుమారస్వామికి మరో అంశం చికాకును కల్గిస్తోంది. కుమారస్వామి కర్ణాటకలో కొత్తగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఈమేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నది కుమారస్వామి ఆలోచన. ఆయనే ఆర్థిక శాఖను కూడా చూస్తుండటంతో ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. వచ్చే నెల మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కుమారస్వామి నిర్ణయించారు.

కాంగ్రెస్ అభ్యంతరం…..

అయితే కాంగ్రెస్ మాత్రం ఇందుకు అభ్యంతరం చెబుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెడితే సరిపోతుందని ఆయన సమన్వయ కమిటీ సమావేశంలో చెప్పేశారు. కొందరు సిద్ధరామయ్య ఆలోచనకు కోరస్ పాడారు. దీంతోకుమారస్వామికి చిర్రెత్తుకొచ్చింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టకుంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు సత్వరమే ఎలా నెరవేరుతాయని ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ తో భేటీఅయి…..

మరో సంగతటేంటంటే…. సిద్ధరామయ్య అభ్యంతరాన్ని ఆ పార్టీనేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరమేశ్వర కూడా వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కుమారస్వామి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయన ప్రధానంగా రాహుల్ తో మరోసారి మంత్రి వర్గ విస్తరణ, బడ్జెట్ సమావేశాల గురించే ఎక్కువగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఇక త్వరగా తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో కుమారస్వామి ఉన్నారు. కాని స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతుండటంతో ఆయన నేరుగా రాహుల్ ను కలసి చర్చించడం కర్ణాటక కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కలహాల కాపురాన్ని రాహుల్ గాంధీ, కుమారస్వామిలు ఎన్నాళ్లు నెట్టుకొస్తారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 40484 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*