
కర్నూలు అసెంబ్లీ సీటు పై రచ్చ రంబోలా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైపు లోకేష్ నిలిస్తే చంద్రబాబు వైపు ఎంపి టిజి వెంకటేష్ నిలిచారు. వీరిద్దరి నడుమ ఇప్పుడు తండ్రి కొడుకులు రాబోయే రోజుల్లో మరింత నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కర్నూలు సీటు పంచాయతీ పై చంద్రబాబు, లోకేష్ బాబు ఇవ్వనున్న తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. తీర్పు ఎలా వున్నా ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తి కి గురికావడం ఖాయం కానుంది. ఈ నేపథ్యంలో కర్నూలు సీటు పై ఎటు తేల్చుకోలేకపోతుంది అధిష్టానం.
ఎత్తులకు పై ఎత్తులు…
కర్నూలు సీటు తన కుమారుడు భరత్ కి సాధించడం పై టిజి వెంకటేష్, సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నువ్వా నేనా అనే స్కెచ్ లు గీస్తూ పనిచేసుకుపోతున్నారు. కొద్ది రోజుల క్రితం మోహన్ రెడ్డి కర్నూల్ నుంచి లోకేష్ బరిలోకి దిగాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనికి కౌంటర్ గా టిజి భరత్ అదే రీతిలో స్పందించారు. అయితే కర్నూల్ స్థానం నుంచి నేరుగా చంద్రబాబు సీన్ లోకి రావాలని ఆహ్వానించారు.
వీధి పోరాటాలు తప్పవా…?
తమ ప్రాంతం మరో అమరావతి కావాలంటే అధినేతే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరి పార్టీ లో తన ప్రత్యర్థికి చెక్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లు ఏ స్థానంనుంచి పోటీ చేయాలో కూడా నేతలు నిర్ణయిస్తూ భవిష్యత్తులో వీధి పోరాటాలకు దిగుతామని చెప్పక చెప్పినట్లు అయ్యింది. మొత్తానికి వీరి గొడవ అధిష్టానానికి రోజు రోజుకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరి ఈ ఆహ్వానాలను బాబు, లోకేష్ లు ఎలా తిరస్కరిస్తారో చూడాలి.
Leave a Reply