జయదేవ్ పై జయం నాదే…!

విజ్ఞాన్ విద్యాసంస్థలు! ద‌క్షిణాదిలోని రెండు, మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో మంచి పేరున్న విద్యా సంస్థలు. వీటి గురించి తెలియ‌నివారు దాదాపు ఎవ‌రూ ఉండ‌రు. ఈ సంస్థల అధినేత లావు ర‌త్తయ్య. ఒక్క విద్యాసంస్థల కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల‌తోనూ ముందుకు పోతూ.. త‌న‌దైన గుర్తింపు సాధించుకున్నారు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లో రాణించేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. మ‌ధ్యలో రెండు సార్లు ఎంపీగా త‌న అదృష్టం ప‌రీక్షించుకున్నా ల‌క్ చిక్కలేదు. ఇప్పుడు ఆయ‌న వార‌సుడు, విదేశాల్లో ఉన్నత విద్యను గ‌డించిన యువకుడు లావు శ్రీకృష్ణదేవ‌రాయులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్‌ను ఎంత‌గానో అభిమానించే ర‌త్తయ్య.. తాను నేరుగా జ‌గ‌న్‌కు జై కొట్టక పోయినా.. త‌న కుమారుడిని వైసీపీలోకి చేర్చారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌ను గుంటూరు పార్లమెంటు స్థానం స‌మ‌న్వయక‌ర్తగా నియ‌మించారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా గ‌ల్లా జ‌య‌దేవ్ చ‌క్రం తిప్పుతున్నారు. ఈయ‌న‌కు చెక్ పెట్టాల‌నే ప్రధాన సంక‌ల్పంతో శ్రీకృష్ణదేవ‌రాయులును జ‌గ‌న్ రంగంలోకి దింపారు. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో లావు ప్రజ‌ల్లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న “తెలుగు పోస్ట్” కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం..

ప్రశ్న : విద్యాసంస్థల అధిపతిగా ఉన్న మీరు ప్రజా క్షేత్రంలోకి వ‌చ్చారు? ఈ ఎక్స్‌పీరియ‌న్స్ ఎలా ఉంది ?

శ్రీకృష్ణదేవరాయలు : ఇప్పటికే మేము ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాము. మా విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్ధులు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇది మాకు ఎంతో గర్వకారణం. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ద్వారా మరింత మందికి ప్రజాసేవ చెయ్యవచ్చనే ఉద్దేశంతోనే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. మా విద్యాసంస్థల ద్వారా ప్రతీ ఏటా 30 వేల మందికి పైగా విద్యార్ధులను ఉన్నత విద్యావంతులుగా, ఉద్యోగార్ధులుగా తీర్చిదిద్దే ఛాన్స్‌ ఉంది. అదే ప్రజాక్షేత్రంలో ఎంపీగా గెలిస్తే క‌నీసం 30 లక్షల మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుంది.

ప్రశ్న : రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎందుకు అనిపించింది?

శ్రీకృష్ణదేవరాయలు : రాజకీయాల్లోకి రావడం వ్యక్తిగత వృద్ధి కోసమో లేదా ఇత‌ర‌త్రా అభివృద్ధి కోసమో కాదు. ఎక్కువ మందికి ప్రజాసేవ చెయ్యాలన్న ఉద్దేశమే ప్రధాన కారణం. వ్యక్తిత్వ పరంగా విజ్ఞాన్ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే మేమేంటో ఉన్నతంగా ఫ్రూవ్ చేసుకున్నాం. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి గుంటూరు జిల్లా ప్రజలకు మరెన్నో సేవాకార్యక్రమాలు చేసి వాళ్ల హృదయాల్లో నిలవాలన్నదే ప్రధాన కారణం. విమర్శనాత్మకమైన రాజకీయం నేను చెయ్యను. నేను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో అదే ప్రజ‌ల‌కు చెబుతాను… అదే చేస్తాను. ప్రత్యర్ధుల మీద బురద జల్లడం, విమర్శలు చెయ్యడం లాంటి రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. నేను ఏదైతే ప్రజలకు చేయలనుకున్నానో అదే సూటిగా చెప్పడం… అదే చేయడం రాజకీయాల్లో నా ప్రధాన‌ లక్ష్యం.

ప్రశ్న : ర‌త్తయ్య గారి వార‌సుడిగానే మీకు టిక్కెట్ వ‌స్తుంద‌న్న అభిప్రాయం ఉంది ?

శ్రీకృష్ణదేవరాయలు : ర‌త్తయ్య గారి వార‌సుడిగానే నేను ఎంట్రీ ఇచ్చాను. నాన్న గారి పేరుతో రాజ‌కీయాల్లోకి రావ‌డంలో త‌ప్పులేదు. అయితే వార‌స‌త్వం అనేది కొంత వ‌ర‌కే.. ఎవ‌రైనా త‌మ‌కు తాము ఫ్రూవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్న రాజ‌కీయ నేత‌ల్లో ఎంతో మంది ఇలా వ‌చ్చి ఫ్రూవ్ చేసుకున్న వారే క‌దా.. !

ప్రశ్న : మీరు బలమైన అభ్యర్థితో తలపడనున్నారు. గెలుస్తార‌ని న‌మ్మకం ఉందా.?

శ్రీకృష్ణదేవరాయలు : ఎవ‌రి బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు వారికి ఉంటాయి. ఆయన బలాలు, బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. కోట్లు ఖ‌ర్చుపెట్టి వ్యాపార రంగంలో సక్సెస్ అవ్వొచ్చు. అయితే అవే కోట్లతో రాజకీయాల్లో ఎప్పుడూ సక్సెస్ అవుతామ‌న్న గ్యారెంటీ లేదు. స్థానికంగా ఎవరి దగ్గరకు వెళ్లినా ఆయన అందుబాటులో ఉంటున్నారా ? లేదా ? ఆయన గుంటూరుకు ఏం చేశారు అన్నదానికి ప్రజ‌లు ఇచ్చే ఆన్సరే ఆయ‌న ప‌నితీరుకు నిద‌ర్శనం. గుంటూరు జిల్లా ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రజలు విజ్ఞులు.. వారు సరైన సమయంలో సరైన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గుంటూరు నగరంతో పాటు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎలా ఉందనేది అందరూ చుస్తూనే ఉన్నాం.

ప్రశ్న : నియోజకవర్గంలో తిరుగతూ మీరు గమనించిందేమిటి?

శ్రీకృష్ణదేవరాయలు : ఎంపీ సెగ్మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నా…. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రధాన స‌మ‌స్యల‌ను గుర్తిస్తున్నాను… వాటిని ప‌రిష్కరించేందుకు మంచి ప్రణాళిక‌లు కూడా రెడీ చేస్తున్నాం.

ప్రశ్న : గుంటూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్యను ఎలా ప‌రిష్కరించాల‌నుకుంటున్నారు.?

శ్రీకృష్ణదేవరాయలు : గుంటూరు సిటీ ఈ రోజు తీవ్రమైన తాగు నీటి సమస్యతో కొటుమిట్టాడుతోంది. ఇప్పటికి కనీసం పాల‌కులు, ప్రభుత్వాలు డీపీఆర్లు కూడా రెడీ చెయ్యకపోవడం బాధాకరం. గుంటూరుకు స‌మీపంలోనే రాజ‌ధాని ఉండి… ఏపీలోనే పెద్ద సిటీల్లో ఒక‌టి అయిన‌ గుంటూరు సిటీ ప్రజలు ఈ రోజు తాగు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడడం చాలా బాధాకరం. ఇప్పటికి ఈ సమస్య పరిష్కారం కాకపోవడం చూస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారో ? కూడా అర్థం కావడంలేదు. ఒక తూర్పు నియోజకవర్గంలోనే డ‌యేరియాతో 30 మంది చచ్చిపోయారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు.

ప్రశ్న : జంప్ జిలానీలను మీరు స‌మ‌ర్ధిస్తారా? ఎలా రియాక్ట్ అవుతారు?

శ్రీకృష్ణదేవరాయలు : రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి మారడం అనేదాన్ని సమర్థించే ప్రసక్తే లేదు. ఇటీవల ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బులు పోసి ఇష్టమొచ్చినట్టు కొంటూ రాజకీయవ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల‌పై జనాల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. డబ్బులు తీసుకుని ఓట్లు వేసే రోజులు పొయాయి. రాజకీయ నాయకుడికి ఇకపై జనాలు 1000, 2000, 3000 తీసుకుని ఓట్లు వేసే పద్దతిని తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తమకు ఏం కావాలనే అంశాన్ని స్పష్టంగా అడిగే విషయంలో వాళ్లు క్లారిటీతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు… ఆపై వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎలా ఉంటుందో ? మీరే చూస్తారు.

ప్రశ్న : ఎన్నిక‌ల్లో డబ్బు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది? దీన్ని ఎలా చూస్తారు?

శ్రీకృష్ణదేవరాయలు : ప్రస్తుత రాజకీయం ధన రాజకీయంగా మారింది. అయితే ఇది ఒక్క రోజులో మార్పురాదు. మనం ప్రతీ నియోజకవర్గానికి, మండలాలవారీగా, గ్రామాలవారీగా వెళ్లి వారికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాళ్ల సమస్యను పరిష్కరించిన రోజున ఈ ధనరాజకీయం అనేదే ఉండదు. నేను వచ్చే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ మండలం, గ్రామాల సమస్యలు గుర్తించి వాటిల్లో ఏవైతే పరిష్కరిస్తానో చెప్పి… వాటిని పరిష్కరించని రోజున మళ్ళీ ఎన్నికలకు వెళ్లినప్పుడు నా కాలర్‌ పట్టుకుని నిలతీయమని చెబుతాను. ప్రజల సమస్యల‌ను పరిష్కరించిన రోజున ధన రాజకీయంతో పనేముంటుంది.

ప్రశ్న : మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే ప్రజ‌ల్లోకి వ‌స్తున్నార‌న్న విమర్శలున్నాయి. నిజమెంత?

శ్రీకృష్ణదేవరాయలు : రాజకీయాల్లోకి సంపాదించాలన్న ఉద్దేశంతో రాలేదు. అంత అవ‌స‌రం మా కుటుంబానికి లేదు. ఇప్పటికే మా విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరుకునేలా చేశాం. మేము చెసేదే సేవ. సేవలో ఆస్తుల సంపాదన ఏముంటుంది. లాభాపేక్షలేని విద్యనే విజ్ఞాన్‌ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. విజ్ఞాన్‌ విద్యాసంస్థలు వేసిన పునాది వల్ల భవిష్యత్తులో మూడు, నాలుగు జనరేషన్‌లో బలమైన మార్పు వస్తుందని… ఈ మార్పు సమాజానికి చాలా మంచి చేకూరుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలిస్తే నేను చేసే వినూత్న‌మైన కార్యక్రమాలు కూడా అదే పంథాలో సమాజంలో మార్పుకు, ప్రజల శ్రేయస్సుకు కీలకంగా ఉంటాయని నమ్ముతున్నాను.

ప్రశ్న : కులమే ఎన్నికల్లో ప్రధానం…దీన్ని ఎలా చూస్తారు?

శ్రీకృష్ణదేవరాయలు : ప్రస్తుతం సమాజం కులాలువారీగా చీలిపోయిన మాట వాస్తవమే. అయితే విద్యావంతులు పెరుగుతున్న కొద్ది వ్యవస్థలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడున్న కులాల సమాజం క్రమక్రమంగా కనుమరుగయ్యే రోజులు ప్రారంభమయ్యాయి. కులం అనేది కేవలం ఒక ఐడెంటిటీ కోసం పాకులాడేందుకే ప‌నికొస్తుంది. నీతి, నిజాయితితో, క్రమ‌శిక్షణ‌తో త‌మ‌ పని తాము చేసేవారికి కులాలతో సంబంధంలేదు. కులవ్యవస్థ విద్యాదశనుంచే ప్రారంభమౌతుంది అన్న మాట కూడా పూర్తిగా అవాస్తవం. ఇది అనేక రంగాల్లో పాతుకుని పోయివుంది. కులం గురించి ఇంట్లో మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు లేదా పెద్దలు మందలిస్తే అది పెరుగుతుందని నేనైతే భావించడం లేదు.

ప్రశ్న : గుంటూరు నుంచి మీరు ఎంపీగా ఎన్నికైతే.. మీరిచ్చే తొలి ప్రాధాన్యత ఏంటి ?

శ్రీకృష్ణదేవరాయలు : గుంటూరు నుంచి నేను ఎంపీగా విజయం సాధిస్తే చేపట్టబోయే మొట్టమొదటి బృహత్తర ప్రాజెక్టు గుంటూరు సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పూర్తిగా నివారించడం. ప్రతీ ఇంటికి నీటి కుళాయి ఉండాలన్నదే నా లక్ష్యం. మనిషికి కనీస అవసరమైన తిండి, నివాసంతో పాటు నీళ్ళు ఎంతో అవసరం. సిటీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఇప్పుడు ఉన్న నాయ‌కులు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయో అర్థంకాని పరస్థితి. ఎంపీగా గెలిచిన తర్వాత నా తొలి ప్రాధాన్యం గుంటూరు సిటీలో పూర్తిగా నీటి యద్దడి లేకుండా చెయ్యాలన్నదే.

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*