
మహా కూటమి టైటిల్ బావుంది. కానీ టైటిల్ కి తగ్గ పని మాత్రం నత్తనడకన సాగుతుంది. గులాబీ దళాన్ని కదనరంగంలో మట్టికరిపించడానికి విభిన్న ఆలోచనలతో వున్న వారంతా ఒక జట్టుగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రలో టిడిపి, టిజెఎస్, సిపిఐ వంటివన్నీ చేతులు కలిపి కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని యుగళగీతం మొదలు పెట్టారు. అంతా బావుంది కానీ అసలు సమస్య మ్యానిఫెస్టో రూపంలో ఒకటైతే మరొకటి సీట్ల సర్దుబాటు రూపంలో మహా కూటమి ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం.
ఎవరి హామీలు వారివి …
తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమిలో జతకట్టిన పార్టీలన్నీ ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేస్తూ ఉండటం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి మ్యానిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్ళకుండా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వెళితే ప్రజలు ఎలా నమ్ముతారన్న చర్చ ఆయా పార్టీల్లో నడుస్తుంది. దీనివల్ల ప్రత్యర్థి కి మరింత టార్గెట్ చేసే అవకాశం కల్పించేవారం అవుతామని కొందరంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే విధంగా టిడిపి, జనసేన, బిజెపి జత కట్టి ఎవరి మ్యానిఫెస్టో వారు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల అనంతరం కాపు రిజర్వేషన్ల అంశం మా పార్టీ ఇవ్వలేదని బిజెపి తేల్చింది. రైతు రుణమాఫీ చెప్పింది టిడిపినేనని తప్పించుకుంది.
నాలిక మడతవేయరని గ్యారంటీ ఏది ..?
ఇలా అనేక అంశాలపై హామీలు ఇచ్చిన రెండు పార్టీలు అధికారం చేపట్టాక నాలిక మడత వేశాయి. ఈ హామీలు చెవి మెలిపెట్టి అమలు చేయించే బాధ్యత తీసుకున్న జనసేన టిడిపి, బిజెపిలపై నాలుగేళ్ళ తరువాత యూటర్న్ కొట్టి మోసపోయామంది. టిడిపి సైతం నాలుగేళ్ళ తరువాత బిజెపి చేతిలో మోసపోయమంటుంది. ఇలా ఎవరికివారు మరొకరి చేతిలో మోసపోయారంటూ తిరిగి తాజా ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల ముంగిట నిలిచారు. ఇప్పుడు ఆ పార్టీలను ప్రజలు ఏ మేరకు తిరిగి ఆదరిస్తారన్నది రాబోయే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. అదే రీతిలో ఇప్పుడు తెలంగాణాలో మహాకూటమి కొత్త రాజకీయానికి తెరలేపింది. మరి ఓటర్లు ఏ మేరకు వీరి విడి విడి హామీలు ఉమ్మడి హామీలు నమ్ముతారు అన్నది తేలిపోనుంది.
Leave a Reply