మహర్షి మూవీ రివ్యూ

maharshi movie collections

బ్యానర్: వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమాస్, వైజయంతి మూవీస్
నటీనటులు: మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
నిర్మాత: దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి

మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ… సూపర్ స్టార్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకి ప్రేక్షకుల నుండి, ట్రేడ్ నుండి భారీ అంచనాలుంటాయి. ‘బ్రహ్మోత్సవం’ భారీ డిజాస్టర్ అయినా.. ‘స్పైడర్’ మీద పిచ్చెక్కించే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ‘స్పైడర్’ పోయినా… ‘భరత్ అనే నేను’ మీద అంతే అంచనాలు.. లెక్కకు మించి బిజినెస్ జరిగింది. ఇక ‘స్పైడర్’ లో స్పై గా స్టైలిష్ గా నటించి… ఒక శాడిస్ట్ అంతుచూసిన మహేష్ బాబు… ‘భరత్ అనే నేను’ లో చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం తండ్రి అనుభవించిన సీఎం పదవిని అలంకరించడం… సీఎంకి కూడా మనసుంటుందని.. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించడం వంటి అంశాలతో మహేష్ సూపర్ స్టైలిష్ గా అద్భుతంగా నటనతో అందరిని పడేసాడు. ‘భరత్ అనే నేను’కి హిట్ టాక్ పడింది కానీ… మహేష్ సినిమా అనేసరికి అంచనాలు దాటి బిజినెస్ జరగడంతో.. అక్కడ నిర్మాత సేఫ్ అయినా బయ్యర్లు కొద్దిగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక ‘భరత్ అనే నేను’ తర్వాత ఆచి తూచి వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాని దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీల నిర్మాణ సారథ్యంలో మొదలుపెట్టాడు. అయితే వంశి పైడిపల్లి ట్రాక్ రికార్డ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోవడం, అలాగే వంశికి క్లాస్ డైరెక్టర్ గా పేరుండడం వలన… ఈ సినిమా మొదలైనప్పటికీ భారీ అంచనాలైతే వచ్చాయి…. కానీ మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అంటే ‘మహర్షి’ పాటలతో ‘మహర్షి’ మీద అంచనాలు తగ్గడం, ‘మహర్షి’ని శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తో పోల్చడంతో ‘మహర్షి’ మీద అంచనాలు తగ్గడం మొదలైంది. కానీ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మళ్లీ ‘మహర్షి’ మీద అంచనాలు పెరిగేలా చేసింది. ఇక ‘మహర్షి’ ట్రైలర్ వచ్చాక మహర్షి మీదున్న అనుమానపు పొరలు పూర్తిగా తొలిగిపోయి.. సినిమా మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. హీరోయిన్ పూజ హెగ్డే లాంటి గ్లామర్ డాల్, మరో హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడం వంటి అసక్తికర అంశాలతో ‘మహర్షి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మహేష్ ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన ‘మహర్షి’ సినిమా వంశీపైడిపల్లికి, పూజ హెగ్డే కి, అల్లరి నరేష్ కి ఎలాంటి హిట్ ఇచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ

రిషి కుమార్(మహేష్ బాబు) తన కాలేజ్ రోజుల నుంచే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న ఒక ధృడ సంకల్పంతో ఉంటాడు. అనుకున్నట్టుగానే రిషి ఓ కంపెనీకి సీఈఓ అవుతాడు. ఓడిపోవ‌డం అంటే ఏమిటో తెలియని బిజినెస్ మేన్‌ లా ఎదుగుతాడు. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌యానికి సోపానాలుగా మ‌ల‌చుకున్న వ్య‌క్తి. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రు స్నేహితుల (పూజ హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. రవి (అల్లరి నరేష్) కోసం రుషి ఏం చేశాడు? విజ‌యం అంటే డ‌బ్బు సాధించ‌డ‌మే, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే రిషి… అసలు మహర్షిగా ఎలా మారాడు? ఈ సినిమాలో మహేష్ కి అల్లరినరేష్ కి ఫ్రెండ్ గా నటించిన హీరోయిన్ పూజ పాత్రేమిటి? అవన్నీ తెలియాలంటే మహర్షి సినిమా వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన

మహేష్ బాబుకి మాస్ ఎలెమెంట్స్ కన్నా క్లాస్ ఎలెమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందానికి అందగాడు, స్టయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే మహేష్ బాబుకు క్లాస్ లుక్ కొట్టిన పిండే. కానీ మాస్, మిడిల్ క్లాస్ లుక్ కి మాత్రం మహేష్ అంతగా సెట్ కాడు. ఇక మహర్షిలో మహేష్ బాబు మూడు రకాల యాంగిల్స్ లో ఇరగదీసాడు. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా క‌నిపిస్తాడు. మొట్ట మొదటిసారి మహేష్ గడ్డం లుక్ లో కనిపించడం మహేష్ అభిమానులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్…. విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. మ‌హేష్ తెర‌పై మ‌రింత అందంగా క‌నిపించాడు. ఇక హీరోగా వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న అల్ల‌రి న‌రేష్‌కి మహర్షిలో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ దక్కింది. మహర్షి క‌థ‌కి మూల‌స్తంభంగా రవి పాత్రలో అల్లరిని తప్ప మరే నటుడిని ఊహించలేం అన్నట్టుగా ఉంది అల్లరి నరేష్ నటన. గతంలో క్రిష్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా అల్లరి నరేష్ కీలకపాత్రలో వచ్చిన గమ్యంలో గాలి శీను పాత్ర ఎంత బలమైనదో మహర్షిలో రవి పాత్ర కూడా దాదాపు అంతే. ఇలాంటి పాత్ర‌ల‌కు ఇక‌పై న‌రేష్ పేరుని ప‌రిశీలించ‌డం ఖాయం. ప్రస్తుతానికి టాప్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్ పూజ హెగ్డేకి ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా జెట్ స్పీడుతో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పూజహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం చేయ‌లేదు. క‌థానుసారం పూజ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్‌ సన్నివేశాల్లో చిలిపిదనంతో ఆకట్టుకున్న పూజ పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. మహర్షిలో విలన్ పాత్ర చేసిన జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ అంతగా పండకపోయినా అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ తమ పాత్రలకు ఎప్పటిలాగే న్యాయం చేశారు.

విశ్లేషణ

మహేష్ బాబు కి ఈ మహర్షి మూవీ ఎంతో స్పెషల్. ఎందుకంటే మహేష్ కెరీర్ లో ఈ మహర్షి 25 వ సినిమా కావడం. అందుకే ముగ్గురు నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు, వంశి పైడిపల్లి కూడా మహేష్ కి ఎప్పటికి గుర్తుండిపోయే హిట్ ఇవ్వాలనే ఈ మహర్షి కోసం కష్టపడ్డారు. ఓ మైలు రాయి చిత్రానికి ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో అవ‌న్నీ జోడించి అల్లుకున్న క‌థ‌లా అనిపిస్తుంది మహర్షి సినిమా చూస్తున్నంతసేపు. సీఈఓగా రిషిని ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఆ వెంట‌నే ఫ్లాష్ బ్యాక్ మొద‌లైపోతుంది. సీఈఓగా, విద్యార్థిగా అప్ప‌టిక‌ప్పుడు త‌న పాత్రలోనే రెండు వేరియేష‌న్స్ చూపించాడు మ‌హేష్‌. కాలేజీ స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమ లాంటి ఎమోష‌న్స్ పండిస్తూనే విద్యా వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌ను ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశాడు. కాలేజీ నేప‌థ్యం, ముగ్గురి మ‌ధ్య స్నేహం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాటలు, కామెడీ సీన్స్ అలాగే ‘సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ మహేష్ ఇచ్చే స్పీచ్, ఫైట్ సీన్లు, ఇంటర్వెల్లో చోటు చేసుకునే ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచి సెకండాఫ్ పై మరింత ఆసక్తిని రేపుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ కుర్రాడిలా కనిపించిన రిషి… సెకండ్ హాఫ్ లో రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాడు. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీన‌స్థితిని క‌ళ్ల‌కు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు వంశీ. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం. సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువ కావడం వల్ల ప్రతీ నిమిషం కీలకమే. దాని వల్ల ప్రేక్షకుడు ఆ ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు. కానీ అది అక్కడక్కడా ఈ చిత్రంలో మిస్సవుతున్న భావన కలుగుతుంది. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకం అనుకున్న మ‌హేష్ – న‌రేష్ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌ ఇంకాస్త బాగా పండాల్సింది. అలాగే వంశీ పైడిపల్లి మహర్షి క్లయిమాక్స్ రొటీన్ గా అనిపించినా… ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. ఫైనల్ గా మహేష్ మహర్షి జర్ని స్టార్ట్ అయినట్లే.

సాంకేతిక వర్గం పనితీరు

శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలకు వ‌చ్చిన అద్భుతమైన మ్యూజిక్ దేవిశ్రీ ఈ మహర్షికి ఇవ్వకపోయినా… ఎమోషనల్ గా ఇచ్చిన రెండు పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఊహించిన స్థాయిలో ఇవ్వలేదు. మొదటి నుండి మహర్షి పాటలు మార్కెట్ లోకి రావడం ఎప్పుడైతే మొదలుపెట్టాయో అప్పటి నుండి దేవిశ్రీ సంగీతం మీద పెదవి విరుపులు వినిపించినట్టుగానే.. మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ కాస్త నిరాశపరిచాడు. కే యూ మోహనన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా కనిపిస్తుంది. సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా చూపించాడు. అమెరికా లొకేష‌న్స్, సాంగ్స్ లోకేషన్స్ అన్ని చాలా రిచ్ అనిపిస్తాయి. ఇక ప్రవీణ్‌ కె.ఎల్‌ ఎడిటింగ్ మాత్రం మరింత షార్ప్ ఉండాల్సింది. ఇంచుమించుగా మూడు గంట‌ల నిడివి ఉన్న సినిమా ఇది. చాలా సీన్స్ ని కుదించుకునే వీలున్నా.. ఆ దిశ‌గా చిత్ర‌బృందం ఆలోచించ‌లేదు అనిపిస్తుంది. ఇక నిర్మాతలు మాత్రం మహేష్ కి బెస్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో భారీగా పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రెమ్ లోను కనబడుతుంది.

ప్లస్ పాయింట్స్: మహర్షిగా మహేష్ అద్భుతమైన నటన, పూజ గ్లామర్, బలమైన కథ, నరేష్ నటన, కాలేజ్ ఎపిసోడ్, నిర్మాణ విలువలు, ఇంటర్వెల్ ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్: దేవిశ్రీ మ్యూజిక్, ఎడిటింగ్, నిడివి, డల్ నేరేషన్

రేటింగ్: 2.75 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*