
దేశ రాజకీయాల్లో ఇప్పడంతా కూటముల ఏర్పాటుపై హాట్‌టాపిక్ నడుస్తోంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ లక ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక్క డ విషయమేమిటంటే… కూటములు ఏర్పాటు చేయాలని చూస్తున్న చంద్రబాబు, కేసీఆర్ తదితరులు ఇద్దరు కీలక నేతల మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు.
మమత కోసం….
వారు మరెవరో కాదు.. ఒకరు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, మరొకరు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఇప్పటికే సీఎం కేసీఆర్ పశ్చిమబెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కానీ ఆమె స్పష్టమైన హామీ ఇవ్వలేదు. బీజేపీ వ్యతిరేక కూటమి అవసరమేనని, ప్రతిపక్షాలన్నీ కలిసి నడవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు గానీ అసలు ఆమె మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా శరద్‌పవార్, తదితర పార్టీల నేతలతోభేటీ అయ్యారు. మమతా బెనర్జీతో భేటీ అయ్యేందుకు, కనీసం ఫోన్లోనైనా మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నా ఆమె అందుబాటులోకి రావడం లేదు.
వీరిద్దరి మద్దతే కీలకం…..
జాతీయ స్థాయిలో కూటమి ప్రభావం చూపాలంటే శరద్‌పవార్‌తోపాటు, మమతాబెనర్జీ మద్దతు కీలకం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీతో మమతాబెనర్జీ భేటీ అయిన సందర్భంలో తమ పార్టే పెద్ద పార్టీ అని కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసే కూటమిలోనే ఉండాలని మమతను కోరారు. అలాగే శరద్‌పవార్‌తో రాహుల్‌గాంధీ కూడా సమావేశమయ్యారు. ఇలా ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎవరికివారు శరద్‌పవార్, మమతాబెనర్జీల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ కాదని…వెళితే….
అయితే ఈ ఇద్దరు మాత్రం ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కూటముల విషయంలో ఎవరికీ స్పష్టమైన మద్దతు ఇవ్వడం లేదు. శరద్‌పవార్, మమతల మనసులో ఏముందో తెలిసిన రోజునే మూడో కూటమి ఏర్పాటుపై క్లారిటీ వస్తుందని పలువురునాయకులు చెబుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే కాంగ్రెస్‌ను కాదని ఏర్పాటు చేసే కూటమితో బీజేపీకే లాభం జరుగుతుందనీ, అందుకే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే కూటమిలో కొనసాగితేనే బీజేపీని ఎదుర్కోవచ్చన్న ఆలోచనలో వీరిద్దరూ ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Leave a Reply