మినిస్టర్ ను ఓడించేందుకు మిషన్…!!

minister jawahar kovvuru constiuency

అనుకోకుండా ఎమ్మల్యే అయ్యారు…ఆయనే ఊహించని రీతిలో మంత్రిగా పదవీ బాద్యతలను స్వీకరించారు. అయితే ఇప్పుడు మాత్రం సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన గాలులు వీయడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష వైసీపీ ఇక్కడ జీరోకు పడిపోయింది. ఆ గాలిలో కొట్టుకు వచ్చిన నేత ప్రస్తుత మంత్రి జవహర్. ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రావెల కిశోర్ బాబును, పీతల సుజాతలను మంత్రివర్గం నుంచి తప్పించడంతో సామాజిక వర్గం కోణంలో మొదటిసారి ఎమ్మెల్యేఅయి మంత్రి పదవి చేపట్టిన జవహర్ కు నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. అదీ సొంతపార్టీ నుంచే కావడం గమనార్హం.

వైసీపీ క్యాడర్ కు వెన్నుదన్నుగా…

మంత్రి అయిన తర్వాత జవహర్ ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్ద మంచి మార్కులే కొట్టేశారు. అయితే కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ను అస్సలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ క్యాడర్ కు ఆయన సాయంచేస్తున్నారన్న ఆరోపణలను కూడా సొంత పార్టీనేతలే చేస్తుండటం విశేషం. జవహర్ ను కలవాలంటే ముందుగా కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ భర్త సుబ్బరాయ చౌదరిని కలవాలి. ఆయన కలవమంటే జవహర్ కలుస్తారట. లేకుంటే లేదు. దీంతో పార్టీనేతలు, క్యాడర్ జవహర్ పై మండిపడుతున్నారు.

ఎంతమందికి ఫిర్యాదు చేసినా….

కొన్నాళ్లుగా కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రగడ జరుగుతూనే ఉంది. కొంతకాలం క్రితం కొవ్వూరుకు మంత్రి లోకేష్ వచ్చినప్పుడు కూడా టీడీపీ నేతలు,క్యాడర్ జవహర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా ఇన్ ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావు, లోకేష్ లకు కూడా జవహర్ పై ఫిర్యాదు చేశారు. జవహర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, సుబ్బరాయ చౌదరి మాట తప్ప ఎవరి మాటా వినరని మంత్రులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నేరుగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదుచేశారు. జవహర్ కు ఈసారి టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు.

పోటీ కార్యాలయం ప్రారంభం…..

అంతేకాదు కొవ్వూరు లో పోటీ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు పోదరుడు అచ్చిబాబు నేతృత్వంలో కొవ్వూరు, చాగల్లు జడ్పీటీసీలు, టీడీపీ నేతలంతా కలసి ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా టీడీపీకి అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం కూడా జవహర్ కు వ్యతిరేకంగా నిలబడటంతో చంద్రబాబు కూడా ఒకింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జవహర్ వచ్చే ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనల తర్వాత జవహర్ ను తిరువూరుకు పంపాలన్న నిర్ణయానికి బాబు వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అనుభవ రాహిత్యమో, అతివిశ్వాసమో తెలియదు కాని జవహర్ సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 23866 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*