ఇస్తారా…ఇవ్వరా…తేల్చిచెప్పరూ…. !!

mlc-seat-fight-in-telugudesamparty

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. శాసన సభ్యులు తన ఓటు ద్వారా ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధానంలో జరిగే ఎన్నికలకు షెడ్యూలు కూడా వచ్చేసింది. మొత్తంగా ఏపీ శాస‌నమండలిలో అయిదు ఖాళీలు ఉంటే అందులో నాలుగు టీడీపీకి దక్కనున్నాయి. ఇందులో తమకూ వాటా కావాలని విశాఖ టీడీపీ నేతలు పట్టుపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచే ఎమ్మెల్సీల విషయంలో విశాఖ నుంచి ఎవరికీ ఛాన్స్ రాలేదని గుర్తు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే గవర్నర్ కోటాలో కూడా నామినేట్ చేసే ఎమ్మెల్సీలు కూడా విశాఖ నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదని కూడా పేర్కొంటున్నారు. అందువల్ల ఈ తడవ తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలా కోరుకుంటున్న వారిలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉండడం, అదీ ఎన్నికల టైమ్ కావడంతో టీడీపీ హై కమాండ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

మైనారిటీ కోటాలో….

ఎపుడో పాతికేళ్ల క్రితం, అది కూడా అన్న నందమూరి దయతో ఎమ్మెల్యే అయిన విశాఖ అర్బన్ జిల్లా మైనారిటీ నాయకుడు ఎస్ ఎ రహమాన్ తనకు ఎమ్మెల్సీ సీటు కావాలని కోరుతున్నారు. 1994 తరువాత మళ్ళీ చట్ట సభలో అడుగుపెట్టింది లేదని, అందువల్ల తనను నామినేట్ చేయాలని ఆయన అడుగుతున్నారు. విశాఖ దక్షిణంలో బలమైన మైనారిటీ నేతగా ఉన్న రహమాన్ ఓ వైపు ఎమ్మెల్యే టికెట్ రేసులో కూడా ఉన్నారు. దాంతో అక్కడ పోటీని నివారించాలంటే ఆయనకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఇవ్వాలని మిగిలిన నేతలు కూడా కోరుతున్నారు. దక్షిణంలో పెద్ద సంఖ్య‌లో మైనారిటీలు ఉండడంతో వారిని ఇటు వైపు తిప్పుకోవడానికైనా రహమాన్ని ఎమ్మెల్సీ చేయామంటున్నారు. రహమాన్ కి మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతు ఉంది. అలాగే, మైనారిటీ మంత్రి ఫరూక్ ద్వారా కూడా బాబుతో లాబీయింగ్ చేస్తున్నారు.

గిరిజన కోటాలో…..

ఇక విశాఖ ఏజెన్సీ పాడేరుకు చెందిన మాజీ మంత్రి మణికుమారి తనకు ఎమ్మెల్సీ ఇచ్చి సీనియారిటీని గౌరవించాలని కోరుకుంటున్నారు. 1999 ఎన్నికల్లో పాడేరు నుంచి గెలిచిన ఆమె అదే సమయంలో మంత్రి గా కూడా పనిచేశారు. ఆ తరువాత ఆమె మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. పాడేరు టికెట్ ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఇవ్వాలని హై కమాండ్ భావిస్తున్న తరుణంలో పేచీ లేకుండా పార్టీ అంతటా ఒక్కటిగా నిలవాలంటే మణికుమారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని మిగిలిన గిరిజన నాయకులు అంటున్నారు. అదే విధంగా విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసిన వంజంగి కాంతమ్మ కూడా ఎమ్మెల్సీ పోస్ట్ కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి తాను ఎంతో క్రుషి చేశానని, ఇపుడు కూడా గెలిపించాలంటే తనకు న్యాయం చేయాలని ఆమె అంటున్నారు.

రూరల్ జిల్లాకే పెద్ద దిక్కు ఆయన….

ఇక విశాఖ రూరల్ జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఇన్నేళ్ళ తరువాత చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న కుతూహలంతో ఉన్నారు. రాజకీయాలకు ఎపుడూ తెర చాటునే ఉండే ఆయనకు జీవిత చరమాంకంలో మాత్రం పెద్దల సభలో కూర్చోవాలన్న కోరిక కలిగిందంట. రూరల్ జిల్లాలో ప్రతీసారీ టీడీపీ గెలుపు వెనక అర్ధబలం, అంగబలం అన్నీ తానే అయి నడిపించే ఆడారి అధినేత చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన కనుక అడిగితే బాబు కాదు అనేది లేదు. పైగా జిల్లాలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేత. దాంతో ఆడారికి ఎమ్మెల్సీ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. వీరే కాకుండా టీడీపీలోకి మళ్ళీ చేరితే తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా రాయబేరాలు నడుపుతున్నారు. మొత్తానికి చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నా ఉన్నవి నాలుగే కావడంతో ఉత్తరాంధ్రాకు ఈసారి న్యాయం జరుగుతుందా అన్న సందేహాలు ఉన్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30935 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*