ఇద్దరూ అసాధ్యులే….!!!

బీజేపీ

ఈసారి భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లురావు. 2014 కన్నా ఎంతో కొంత తక్కువ రావచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లో కమలం పార్టీకి చిక్కులు తప్పవు. ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఓడిపోయినా ఆశ్చర్యం అక్కరలేదు. ఇవీ ఎన్నికలకు ముందు వివిధ వర్గాల నుంచి విన్పించిన వ్యాఖ్యానాలు… విశ్లేషణలు. అంతరింగిక చర్చల్లో బీజేపీ సయితం వీటిని తోసిపుచ్చే సాహసం చేయలేదు. అయితే ఇందుకు గల ప్రత్యామ్నాయాలపై గట్టి కసరత్తే చేసింది. ఉత్తరాదిన తరుగుపడే సీట్లను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భర్తీ చేసుకోవాలని ఆలోచించింది. ముఖ్యంగా తూర్పున గల పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై దృష్టి పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 63 స్థానాలున్నాయి. కనీసం వీటిల్లో సగం అయినా తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాధులు ఆశించారు. ఆమేరకు వ్యూహరచన చేశారు. క్షేత్రస్థాయిలో వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసి విజయం సాధించారు.

బెంగాల్ పై పట్టు…..

ముందుగా 42 స్థానాలు గల అతి పెద్ద రాష్ట్రమైన బెంగాల్ పై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో పార్టీ కేవలం రెండంటే రెండు సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష శిబిరం నుంచి తనపై కత్తులు నూరుతున్న, వాడి వేడి విమర్శలను ఎక్కుపెట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పై రాజకీయ దాడి ప్రారంభించింది. మొత్తం 42 స్థానాల్లో 18 స్థానాలను తనఖాతాలో వేసుకున్న కమలం పార్టీ మమతకు గట్టి సవాల్ విసిరింది. గతంలో 34 స్థానాలను గెలుచుకున్న టీఎంసీ ఈసారి 22 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తం 12 స్థానాలను కోల్పోయింది. తన బలాన్ని కమలం రెండు స్థానాల నుంచి 18కి పెంచుకోవడం ఆషామాషీ కాదు. అంత తేలికైన విషయం కాదు. 2014లో రెండు స్థానాలను గెలుచుకున్న సీపీఎం ఈసారి కనీసం ఖాతా తెరవలేకపోయింది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకున్న హస్తం పార్టీ రెండు స్థానాలకు పరిమితమయింది. తద్వారా కాంగ్రెస్, సీపీఎంలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను బీజేపీ దక్కించుకుంది. ఈ ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతను అధికారం నుంచి తొలగించేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది.

ప్రజల్లోకి బలంగా….

స్థానిక ముస్లింలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలపై మమత ఆధారపడగా, అగ్రవర్ణాలు, హిందూ ఓట్లపై బీజేపీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్, సీపీఎంను పక్కన పెట్టి మమత వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా పొందింది. శారద, రాజ్ వ్యాలీ కుంభకోణాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లింది. ప్రధాని మోదీ కూడా బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మోదీ, అమిత్ షాలు మొత్తం 17 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మమత పాలనలో అవినీతి పెరిగిందని, శాంతిభద్రతలు గాడి తప్పాయని వారు ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపిస్తామన్న వారి హామీతో మెజారిటీ ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది.

అసాధ్యం కాదని….

బలం పెంచుకోవడానికి బీజేపీ దృష్టి పెట్టిన మరో రాష్ట్రం ఒడిశా. బిజూ జనతాదళ్ పాతుకుపోయిన ఈ రాష్ట్రంలో 21 లోక్ సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. 20 స్థానాలు బిజూ జనతాదళ్ ఖాతాలో పడ్డాయి. బీజేపీ ఈసారి తన బలాన్ని ఎనిమిదికి పెంచుకుంది. బీజేడీ 12 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమయింది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. 147 స్థానాలుగల అసెంబ్లీ ఎణ్నికల్లో బిజూ జనతాదళ్ 113 స్థానాలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 22 స్థానాలను సాధించిన కమలం పార్టీకి ఈసారి ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రధాన ప్రతిపక్షాన్ని మూడో స్థానంలోకి నెట్టేసింది. కమలం పార్టీ బలం 10 స్థానాలు మాత్రమే. ఈసారి అదనంగా మరో 12 స్థానాలను తన ఖాతాలో వేసుకంుది. గతంలో 16 స్థానాలను సాధించిన కాంగ్రెస్ ఈసారి 9 స్థానాలకే పరిమితమయింది. ఈ ఊపుతో 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడాలన్నది కమలనాధుల వ్యూహం. బాలాసోర్, బర్ ఘర్ , భువనేశ్వర్, బోలంగిర్, థెంకనూర్, మాయర్ భంజ్, సలబల్ పూర్, సుందర్ ఘర్ నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. ఒక్క స్థానం నుంచి ఎనిమిది స్థానాలకు ఎదగడం, శాసనసభలో ప్రధాన విపక్షంగా ఉండటం సామాన్య విషయం కాదు. ఈ ఊపుతో మరింత ముందుకుదూసుకు వెళ్లాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనపడుతుంది. అది ఏమీ అత్యాశ కాదు. అసాధ్యం కానే కాదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*