సేఫ్ ప్లేస్ చూసుకున్నారా…??

modugula venugopalreddy guntur parlament

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మోదుగులను జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంటు స్థానంపైనే మక్కువ ఎక్కువ. గతంలో కూడా నరసరావు పార్లమెంటు స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లోనూ ఆయన పార్లమెంటు స్థానాన్ని ఆశించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ను కేటాయించారు. నాలుగున్నరేళ్ల పాటు పార్టీలో ఉండలేక..ఇమడలేకపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎక్కడి నుంచి పోటీ…?

అయితే మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎక్కడ పోటీ చేస్తారు? ఆయన ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? ఇదే ఆసక్తికరంగా మారింది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో నరసరావుపేట పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహించడంతో అక్కడి నుంచి బరిలోకి దిగుతారని భావించారు.కానీ ఈసారి జగన్ కొంత వ్యూహం మార్చినట్లు కనపడుతోంది. నరసరావుపేట పార్లమెంటుకు లావు శ్రీకృష్ణ దేవరాయలును పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. నరసరావు పేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగుతుండటంతో సామాజిక సమీకరణాల ప్రకారం లావు శ్రీకృష్ణదేవరాయలును పోటీకి దింపాలన్న యోచనలో జగన్ ఉన్నారు.

గుంటూరు పార్లమెంటు నుంచి….

ఇక పార్టీలోకి వచ్చిన మోదుగులకు గుంటూరు పార్లమెంటు స్థానం కేటాయిస్తారని చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే మోదుగుల వెంట కొందరు టీడీపీ నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక్కడ మరోసారి గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి బాలశైరిపై 69 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. గల్లా జయదేవ్ కు 5.18 లక్షల ఓట్లు వస్తే, బాలశౌరికి 5.49 వేల ఓట్లు రావడం విశేషం. ఈసారి మోదుగులను బరిలోకి దించితే జయదేవ్ కు చెక్ పెట్టవచ్చన్నది వైసీపీ ఆలోచన.

ఇక్కడ అత్యధికంగా గెలిచింది…..

నిజానికి గుంటూరు పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ఫలితాలను చూసుకుంటే కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే ఎక్కువగా గెలుపొందారు. ఎన్జీ రంగా మూడుసార్లు, రాయపాటి సాంబశివరావు నాలుగుసార్లు గెలుపొందారు. 1991లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి లాల్ జాన్ భాషా ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతగా గెలుపొందారు. అయితే ఇక్కడ మరో విశేషమేంటంటే గుంటూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలుపొందింది కేవలం మూడుసార్లే. కాంగ్రెస్ పార్టీయే 12 సార్లు అత్యధికంగా గెలవడం గమనార్హం. ఈ లెక్కలన్నీ చూసుకుంటే మోదుగులకు గుంటూరు పార్లమెంటు సేఫ్ కాదా? అవునా? అన్న చర్చ ఆయన అనుచరుల్లో జరుగుతుంది. మొత్తం మీద గుంటూరు నుంచి మోదుగుల బరిలోకి దిగితే జయదేవ్, వేణుగోపాల్ రెడ్డి మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది.

Ravi Batchali
About Ravi Batchali 18134 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*