మోస్ట్ హ్యాపియస్ట్ పొలిటీషియన్….!!

most happiest politician kchandrasekharrao

తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యంలో ఒక కొత్త చరిత్రకు తెరతీయబోతున్నాయి. మంచి కోసం జరిగే ప్రతి పరిణామమూ ఆహ్వానించదగ్గదే. అయితే చెడుకు కొత్త సంకేతాలు పంపడమే విచారించదగ్గ విషయం. మూడింట రెండు వంతుల మెజార్టీతో అనూహ్యమైన విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రసమితి. ఈ విజయం సరిపోదు. అసలు విపక్షమే ఉండకూడదన్నట్లుగా కాంగ్రెసు, ఇతర పక్షాలను ఆకర్షించేందుకు చేస్తున్న యత్నాలు ప్రజాస్వామ్యహితైషులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో కేసీఆర్ అధికారానికి, ఆధిపత్యానికి తిరుగులేదు. 2014తో పోలిస్తే 2018 ప్రజాతీర్పు ఏకపక్షంగా లభించింది. నిర్ద్వంద్వంగా తమ నాయకుడు కేసీఆర్ అని ప్రజలు తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో మరొక నేత ఆయన దరిదాపుల్లో కూడా లేరు. తాను ఏ విధంగా రాష్ట్ర ప్రగతికి, ప్రజాసంక్షేమానికి పనిచేయాలనుకుంటున్నారో ఆ విధంగా పనిచేసుకునేందుకు కేసీఆర్ కు ఎటువంటి ఆటంకాలు లేవు. నూటికి నూరుపాళ్లు తన అజెండాను అమలు చేసుకునేందుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సాధారణంగా అయిదేళ్ల పాలన తర్వాత ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత తొంగి చూస్తుంది. ఆశ్చర్యకరంగా ప్రజామద్దతు వెల్లువెత్తింది. 12శాతం అధికంగా ఓట్లు తెచ్చుకోగలిగింది టీఆర్ఎస్. ఈ ఏకపక్ష విజయాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా మలచుకోవాలనుకుంటున్న కేసీఆర్ వైఖరిపై విమర్శలు వినవస్తున్నాయి.

నోళ్లకు తాళం…

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో అందరి సహకారం అవసరం. 2014లో తెలంగాణ ఊపిరిపోసుకుంది. ప్రతిపక్ష,అధికారపక్ష వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తొలి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయడానికి విపక్షాలు చేయని ప్రయత్నం లేదు. తొలి ఏడాదిలో ఉమ్మడి రాజధానిలో టీఆర్ఎస్ ను రాజకీయంగా ఇక్కట్ల పాలు చేయడానికి తెరవెనుక వ్యూహాలు రచించింది తెలుగుదేశం. టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉండటంతో ఆ ప్రమాదం తొలగిపోయింది. టీడీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకుని అమరావతికి తరలిపోవాల్సి వచ్చింది. కాంగ్రెసు, వామపక్షాలు, తెలంగాణ పొలిటికల్ ‘జాక్’ సైతం అడుగడుగునా ప్రభుత్వాన్ని అపహాస్యం పాలు చేయడానికి యత్నించాయి. ఏపని చేపట్టినా అడ్డుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. న్యాయస్థానాల్లో కేసులు వేయడం మొదలు ఆందోళనల వరకూ అవసరానికి మించి అతి చేశాయి విపక్షాలు. నిర్మాణాత్మక విమర్శ, సహకారం అందించలేదు. తమ నోటికాడ తిండిని కేసీఆర్ కొట్టేశారనే దుగ్ధ కాంగ్రెసులో కనిపించింది. ఫలితంగా కేసీఆర్ సైతం పక్కా రాజకీయమేచేశారు . తాజాగా ప్రజలు రెట్టించిన విజయాన్ని అందించడంతో విపక్షాల నోళ్లకు తాళం పడిపోయింది. కాంగ్రెసులో కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వంటి వారు నోరు మెదపలేకపోతున్నారు. రేవంత్, డీకేఅరుణ వంటి ఫైర్ బ్రాండ్లను ప్రజలే పక్కన పెట్టేశారు. ఇది ఒకరకంగా ప్రతిపక్షాలకు నష్టదాయకమే.

ఖరీదైన తీర్పు…

కేసీఆర్ గెలిచారు. నిజమే. కానీ ఈ విజయం ఖరీదెంత? అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. గడచిన నాలుగేళ్లుగా ఏటా నలభై వేల కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తూ నిత్యం ప్రజలను సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. అర్హత, అవసరాలతో సంబంధం లేకుండా పప్పుబెల్లాల మాదిరిగా పైసలు పంచిపెడుతూ వచ్చారు. అయినా నమ్మకం కుదరక కాంగ్రెసు పార్టీ ఎన్నికల హామీలతో కేసీఆర్ పోటీ పడ్డారు. అధికారం దక్కుతుందన్న నమ్మకం లేని స్థితిలో చేతికి ఎముక లేదన్నట్లుగా హామీల వర్షం కురిపించింది హస్తం పార్టీ. అధికారంలో ఉండటంతో ఖజానా పరిస్థితి తెలుసు. అయినా కేసీఆర్ మేనిఫెస్టోలో కాంగ్రెసుతో పోటీపడ్డారు. పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేశారు. రైతు రుణమాఫీ హామీ గుప్పించారు. రైతుబంధు మొత్తం పెంచారు. నిరుద్యోగ భృతికీ పూచీకత్తునిచ్చారు. అప్పటికే సర్కారుపై సానుకూలత ఉన్న ప్రజల్లో ఇవన్నీ బాగానే పనిచేశాయి. అనూహ్యమైన మెజార్టీలతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు అమలు విషయానికొచ్చి చూసుకుంటే బడ్జెట్ లో సంక్షేమ పద్దును రెట్టింపు చేయాల్సి ఉంటుంది. ఏటా 75 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. తెలంగాణ ఎంత ధనిక రాస్ట్రమైనా దీనిని తట్టుకోవడం అంత సులభం కాదు.

ప్రజాస్వామ్యం మెడపై…

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్న నాయకుడు కేసీఆర్. కేంద్రంలో మోడీ సైతం క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడిది విషమ సమస్య. 2014 నాటి రైతు రుణమాఫీ హామీలు ఇంకా పూర్తి చేయలేదు. తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు వంటి పథకాలు ఏపీలో పెట్టాలనే ఒత్తిడి పెరుగుతోంది. బలమైన ప్రతిపక్షంతో ఏపీ సీఎం ప్రతినిత్యం అభద్రతభావాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ హ్యాపియస్ట్ పొలిటీషియన్. అయినప్పటికీ రాజకీయాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కారు కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరినీ కలిపేసుకుని ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే యత్నం. కాంగ్రెసు నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శోభస్కరం కాదు. గతంలో కాంగ్రెసు పార్టీకి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బంపర్ మెజార్టీలు ఉండేవి. బలమైన విపక్షం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాతనే కాంగ్రెసు పార్టీకి అసలు రాజకీయం తెలియవచ్చింది. విశృంఖలమైన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనిని కేసీఆర్ ఎంత తొందరగా గ్రహిస్తే అంతగానూ టీఆర్ఎస్ కు, రాష్ట్రానికి మంచిదంటున్నారు పరిశీలకులు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 41269 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*