
ఏపీలో అధికార పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అనంతపురం. ఈ జిల్లాలోని శింగనమల నియోజకరవ్గంలో అధికార టీడీపీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎంతో బలమున్న ఈ నియోజకవర్గంలో తల్లీకూతుళ్ల తీరుతో పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా కొనసాగతున్న ఎమ్మెల్సీ తల్లి శమంతకమణి, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూతురు యామినిబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందేంటి.. ఒకే పార్టీ.. అదికూడా.. తల్లీకూతుళ్ల మధ్య ఇదేం ఆధిపత్య పోరు..? ఇదేం పనితీరని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఎవరికివారుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు.
పార్టీకి పట్టున్న ప్రాంతం……
ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా తల్లీకూతుళ్లు రచ్చకెక్కితే.. ఇదే అదనుగా మరికొందరు టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి శింగనమల నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహిరించారు. నిజానికి.. కార్యకర్తలు, ప్రజల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలవడం సులభమని అంటారు. అందుకే ఇక్కడి టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ శమంతకమణి తన కూతురు యామినిబాలకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు.
కూతరంటే గిట్టని…..
వాస్తవానికి ఈ సీటు కోసం మాజీ మంత్రి శైలజనాథ్ టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినా శమంతకమణి పట్టుబట్టి మరీ కుమార్తెకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. కట్ చేస్తే ఇప్పుడు తన కుమార్తె అంటేనే ఆమెకు పడని పరిస్థితి. అయితే.. ఇద్దరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తారని చంద్రబాబు అనుకున్నారు. అందుకే యామినిబాలకు విప్ పదవి కూడా ఇచ్చారు. కానీ… అనూహ్యంగా తల్లీకూతుళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
తల్లి,సోదరుడు కలిసి……
ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరి వర్గం వారిదే. టికెట్ ఇప్పించి గెలిపిస్తే తనకే ఎదురుతిరుగుతుందా..? అంటూ కేడర్ వద్ద శమంతకమణి వాపోతున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు అశోక్ పోటీ చేస్తామని.. యామినిబాలకు టికెట్ రాకుండా అడ్డుకుంటామని ఆమె చెప్పారట. దీనిపై యామినిబాల మండిపడుతున్నారు. తల్లి, అన్న అశోక్ కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని.. భావించిన యామినిబాల ద్వితీయశ్రేణి నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో టికెట్ కోసం ఇతర నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో చివరి వరకూ టికెట్ కోసం ప్రయత్నించిన బండారి రవికుమార్ కుటుంబం మళ్లీ ఆ ప్రయత్నాల్లో ఉంది. తమ కుటుంబానికి చెందిన శ్రావణికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ కూడా టీడీపీ తరపున పోటీకి ఆసక్తిచూపుతున్నారు.
Leave a Reply