మోత్కుపల్లి మళ్లీ రెడీ అయిపోయారా..?

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు రాజకీయంగా చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయన ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చే విమర్శలను ఆయనే తప్పికొట్టి రక్షణగా నిలిచేవారు. 2014లో కేంద్రంలో, ఏపీలో బీజేపీ-టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనకు గవర్నర్ గిరి కూడా దక్కుతుందనే ప్రచారం జరిగింది. మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇప్పించి చంద్రబాబు కృతజ్ఞత చూపుతాడని అన్నారు. అందుకే ఎప్పుడు, ఏ రాష్ట్రానికి నూతన గవర్నర్ లను నియమించినా మోత్కుపల్లి, ఆయన అనుచరులు ఆశగా ఎదురు చూసేవారు. కానీ, ఆశించిన పదవి దక్కకపోగా ఆయనకు టీడీపీలోనూ ప్రాధాన్యత తగ్గింది. చంద్రబాబుపైనే విమర్శలు చేసి ఆఖరుకి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించినా…

ఆలేరు ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా ఉన్నప్పుడు 1983లో మొదటిసారిగా ఆయన విజయం సాధించారు. అనంతరం 1985, 89, 94, 99లో వరుసగా ఐదుసార్లు విజయం సాధించి ఆలేరు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఓసారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు. కానీ, 2004 ఎన్నికలు, 2008 ఉపఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి డా.నగేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2009లో ఆలేరు జనరల్ కావడంతో మరో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తుంగతుర్తికి మారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఏకంగా జిల్లానే మారి మధిర ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే, ఆయన ఇంతవరకు తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయగా అన్నీ ఎస్సీ రిజర్వుడ్ స్థానాలే కావడం గమనార్హం. ఇప్పుడు ఆయన టీడీపీకి దూరమయ్యాక టీఆర్ఎస్ లో చేరతారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తన సత్తా చూపించాలనుకుంటున్నారు. ఇందుకు తన స్వంత నియోజకవర్గం ఆలేరు సరైందిగా భావిస్తున్నారు.

నియోజకవర్గానికి దూరం కావడంతో…

ఆలేరులో మోత్కుపల్లి ఏడుసార్లు పోటీ చేసి ఐదుసార్లు గెలిచారు. 2004 వరకు ఇక్కడి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 నుంచి నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆయన ఇక్కడ పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. బలమైన నాయకుడిగా, ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన మోత్కుపల్లి పాత పరిచయాలతో మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రతి గ్రామంలో మోత్కుపల్లికి వర్గం ఉండేది. ఆయన నియోజకవర్గానికి దూరమయ్యాక వారంతా ఇతర పార్టీలు, ఇతర నేతల గూటికి చేరారు. దీంతో ఇప్పుడు మోత్కుపల్లి వైపు వెళతారనేది కూడా అనుమానమే. పైగా సుదీర్ఘకాలం ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అభివృద్ధి విషయంలో మాత్రం ఎటువంటి ముద్ర వేసుకోలేకపోయారు. ఇది కూడా ఆయనకు మైనస్ గా మారింది. ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొన్ని సామాజకవర్గాలను చిన్నచూపు చూశారనే ప్రచారమూ ఉంది. అన్నింటికి మించి ఇప్పుడు ఆలేరు జనరల్ స్థానంగా మారింది.

పట్టు కోసం అనేక పాట్లు…

టీఆర్ఎస్ తరుపున తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన బిక్షమయ్యగౌడ్ పోటీ చేయనున్నారు. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న వీరిద్దరినీ కాదని చివరగా 1999లో ఎమ్మెల్యేగా పనిచేసిన మోత్కుపల్లిని ఆలేరు ప్రజలు ఎంతవరకు గుర్తిస్తారో చెప్పలేం. అయితే, వారిద్దరిపైనా ఆరోపణలు, ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది మోత్కుపల్లికి ఏమైనా కలిసివచ్చే అవకాశం ఉంది. దళిత ఓటు బ్యాంకు మాత్రం ఆయనకు అదనపు బలం కానుంది. ఈసారి గెలిస్తేనే తనకు రాజకీయంగా మనుగడ సాధ్యమని భావిస్తున్న ఆయన నియోజకవర్గంలో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాత అనుచరులు దగ్గర చేసుకుంటున్నారు.ఈ నెల 27వ తేదీన నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి తన బలం చాటుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి గవర్నర్ అవుతారనుకున్న మోత్కుపల్లి తిరిగి పాత నియోజకవర్గంలో పట్టు కోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆయన టీడీపీని వీడకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా సీనియర్ అయినందున ఆలేరు టిక్కెట్ ఆయనకే దక్కే అవకాశం ఉండేదనే అంచనాలు ఉన్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*