
రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ కంచు కోట పదిలమేనా ? లేదా ఈ కోటకు బీటలు పడుతున్నాయా ? వచ్చే ఎన్నికల్లో మరో సారి మురళీ మోహన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారా ? లేదా ఆయన వారసురాలిగా ఆయన కోడలు రూపాదేవి ఎంట్రీ ఇస్తా రా? రాజమహేంద్రవరం లోక్‌సభ సెగ్మెంట్లో టీడీపీ విజయ అవకాశాలు ఎలా ? ఉన్నాయి.. ఇక్కడ విపక్ష వైసీపీ బలమెంత ? జనసేన ప్రభావం ఉంటుందా ? అన్నది తెలుగు పోస్ట్ సమీక్షలో చూద్దాం. రాజమహేంద్రవరం లోక్‌సభ సెగ్మెంట్‌తో ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు 14 సంవత్సరాల సుధీర్ఘమైన అనుబంధం ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లోనే ఇక్కడ నుంచి మురళీ మోహన్ టీడీపీ తరుపున పోటీ చేయాలని అనుకున్నారు. దివంగత మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఉన్నప్పుడే మురళీ మోహన్ లోక్‌సభకు పోటీ చెయ్యాలని అనుకున్నా చాలా ఏళ్లుగా ఆయన కల నెరవేరలేదు.
2004లో టీడీపీ తరుపున……
2004లో టీడీపీ ఈ సీటును బీజేపీతో పొత్తులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ఎస్పీపీబీకె. సత్యనారాయణరావుకు కేటాయించగా ఆయన ఓడిపోయారు. 2005నుంచి మురళీ మోహన్ ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టాట్ చేశారు. 2009 ఎన్నికల్లో నాడు ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోటీలో ఇక్కడ నుంచి టీడీపీ తరపున మురళీ మోహన్, ప్రజారాజ్యం నుంచి మరో సినీ నటుడు యువి.కృష్ణంరాజు పోటీ చెయ్యగా నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాటి సిట్టింగ్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వీరిద్దరినీ ఓడించి చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో మురళీ మోహన్ కేవలం 2000 ఓట్ల తేడాతోనే ఓటమిపాలు కావాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే రాజమహేంద్రవరం లోక్‌సభ సెగ్మెంట్ 2009 పునర్విభజనలో చాలా మార్పులు చేర్పులు సంతరించుకుంది.
అసెంబ్లీ స్థానాల్లో గెలిచినా……
పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం ఒకటే పునర్విభజనకు ముందు ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేది. పునర్విభజన తర్వాత గోపాలపురం, నిడదవోలు సెగ్మెంట్లు కూడా రాజమండ్రి లోక్‌సభ సీటు పరిధిలో కలిశాయి. పశ్చమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, అనపర్తి సెగ్మెంట్లు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. 2009లో ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో 5 సీట్లలో టీడీపీ విజయం సాధించినా… 2 సీట్లలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. అయినా ఎంపీకి వచ్చే సరికి మురళీ మోహన్ ఓటమిపాలు కావాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో అనపర్తి సెగ్మెంట్లో నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నల్లమిల్లి శేషా రెడ్డికి ఏకంగా 40వేల ఓట్ల భారీ మెజార్టీ రావడంతో పాటు టీడీపీ మూడో ప్లేస్‌కు పడిపోయింది.
స్వల్ప తేడాతోనే…..
ఆ ఎఫెక్ట్ ఎంపీ సీటు మీద పడి మురళీ మోహన్ ఓటమిపాలు కావాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో మురళీ మోహన్ స్వల్ప తేడాతో ఓడినా ఐదేళ్ల పాటు నియోజకవర్గ పరిధిలోని ఏడు లోక్‌సభ సెగ్మెంట్లలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఒక సామాన్య కార్యకర్త ఇంట్లో సైతం చిన్న ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తతోనూ మమేకమైన ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరిపై ఏకంగా 1.57 లక్షల ఓట్ల భారీ తేడాతో ఘనవిజయం సాధించారు. మురళీ మోహన్ మెజార్టీ ఓ రికార్డ్. మరి ఎంపీగా గెలిచిన మురళీ మోహన్ నాలుగున్నర ఏళ్లల్లో నియోజకవర్గానికి చేసింది ఏంటి అన్నదాని కన్నా ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మురళీ మోహన్ ఎంపీగా గెలవడానికి ముందే బాగా కష్టపడ్డారని గెలిచాక ఆయన నియోజకవర్గంలో కంటికి కనిపించలేదని పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
వచ్చే ఎన్నికలకొచ్చేసరికి……
కొద్ది రోజులుగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యరని… ఆయన వారసురాలుగా మాగంటి రూపాదేవి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలు దగ్గిర పడుతున్న వేళ తిరిగి మురళీ మోహన్ తానే స్వయంగా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. దీంతో మురళీ మోహన్ తానే పోటీ చేస్తానంటే చంద్రబాబు ఆయనను కాదని ఆయన కోడలికి లేదా ఇతరులెవరికైనా టిక్కెట్ ఇస్తారా అన్నది కాస్త సందేహమే. ఇక రాజమహేంద్రవరం లోక్‌సభ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి విషయానికి వస్తే కొవ్వూరులో మంత్రి కేఎస్. జవహర్, గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బలంగానే ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు యాంటీగా రెండో గ్రూప్ తయారు అవ్వడం మాత్రం కాస్త మైనస్‌గా ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లోనూ మురళీ మోహన్ తిరిగి గోపాలపురం, కొవ్వూరులో సిట్టింగులకే ఓటు వేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. నిడదవోలులో వరసగా రెండు సార్లు విజయం సాధిస్తున్న బూరుగుపల్లి శేషారావు ఉన్నారు. ఆయనను మార్చవచ్చని ప్రచారం జరుగుతుంది.
జనసేన ప్రభావంతో……
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నారు. గత ఎన్నికల్లోనే కేవలం 1700 ఓట్ల స్వల్ప తేడాతోనే నెగ్గినా రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఇప్పటికే పలు నివేదికలు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఏడు సెగ్మెంట్లలో మురళీ మోహన్‌కు పెద్ద మైనెస్‌గా ఉన్న సెగ్మెంట్‌గా అనపర్తి అని చెప్పొచ్చు. ఇక రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తో పాటు రాజానగరం సెగ్మెంట్లలో జనసేన ప్రభావం గట్టిగా ఉండనుంది. రాజమహేంద్రవరం రూరల్‌లో బుచ్చయ్య చౌదరి మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. ఇక సిటీలో టీడీపీ నుంచి ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోటీ చెయ్యవచ్చని తెలిసింది. రాజానగరంలో రెండు సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ మూడో సారి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మూడు సెగ్మెంట్లలో జనసేన ప్రభావం, ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు కూడా టీడీపీ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నారు.
Leave a Reply