
సీనియర్ నేత మైసూరా రెడ్డి ఎటువైపు చూస్తున్నారు. ఆయన జనసేన వైపు అడుగులు వేయనున్నారా? జనసేన ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధమవుతారా? అవుననే అంటున్నారు. మైసూరా రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, వైసీపీలో కొంతకాలం ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత ఆయనకు అనుబంధం ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీతోనే. తెలుగుదేశం పార్టీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించింది.
టీడీపీ లో చేరతారని…..
కొంతకాలం క్రితం మైసూరా రెడ్డి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరు నెలల్లో తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది చెబుతానని స్పష్టం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని భావించారు. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాకు చెందిన నేత కావడంతో మైసూరారెడ్డిని చేర్చుకుని ఆ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ కూడా భావించింది. ఆయనకు పార్టీలోనూ, పదవుల పరంగా సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సీన్ మారడంతో…..
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆరునెలల ముందు పరిస్థితులు వేరు. ఇప్పుడు సీన్ మారింది. అప్పుడు తెలుగుదేశం, బీజేపీ కలసి కట్టుగా ఉండేవి. జగన్ కూడా పాదయాత్ర ప్రారంభించి అప్పటికి పది రోజులే అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు మైసూరా అడుగులు వేస్తారని అనుకున్నారు. కాని ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి కూడా అంత బాగాలేదు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైసీపీ కూడా బలం పుంజుకుంది.
ఆయన వ్యాఖ్యలే……
ఈనేపథ్యంలో మైసూరా తాజాగా చేసిన వ్యాఖ్యలు విశ్లేషకులను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతోందని ఆయన చెప్పారు. జనసేన రాకతో ఏపీ రాజకీయాలు మారబోతున్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీలో 23 శాతం మంది ఉన్న కాపు సామాజిక వర్గం అధికారం కోరుకుంటుందని స్పష్టం చేశారు మైసూరా. మైసూరా వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన జనసేన పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్న వాదన విన్పిస్తోంది. మరో పది, పదిహేను రోజుల్లో మైసూరా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. మైసూరా చేరితే సీమలో జనసేన బలం పెరిగినట్లేనన్నది విశ్లేషకుల అంచనా.
Leave a Reply