
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మైసూరా రెడ్డి మనసు మార్చుకున్నారా? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండటమే మేలనుకుంటున్నారా? అవును. మైసూరా సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, అయితే ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడటం లేదు. వాస్తవానికి మైసూరారెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. ఎన్నికలు ఏడాది మాత్రమే ఉండటంతో ఆయన కూడా మూడు నెలల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి……
గతంలో మైసూరారెడ్డి వైసీపీలో ఉండేవారు. కాని అక్కడ నచ్చక బయటకు వచ్చేశారు. ఆయన దాదాపు అన్ని పార్టీలూ చుట్టివచ్చేశారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది. మరోసారి ఎక్స్ టెన్షన్ ఇవ్వక పోవడంతో మైసూరా వైసీపీలో చేరారు. వైసీపీలో చాలా కాలం జగన్ కు రాజకీయ సలహాలిస్తూ ఉండేవారు. అయితే తను వైసీపీలో ఇమడలేనన్న మైసూరా బయటకు వచ్చేశారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు పైనే అవుతుంది. అయితే మూడు నెలల క్రితం ఆయన మీడియా ఎదుటకు వచ్చి త్వరలోనే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.
టీడీపీలో చేరాలన్నది…..
తెలుగుదేశం పార్టీలో ఆయన చేరుతున్నానని చెప్పకపోయినప్పటికీ ఇక అదే పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మైసూరా హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టడం, ప్రత్యేక హోదా నినాదం బలంగా ఉండటంతో వైసీపీకి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని మైసూరా కూడా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడం, ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నట్లు సమాచారం.
పరిణామాలే బ్రేక్ వేశాయా?
దీంతో తాను చేరాలనుకున్న పార్టీకి సానుకూల పరిస్థితులు లేకపోవడతో మైసూరారెడ్డి వెయిట్ చేయడమే మంచిదని భావిస్తున్నారు. నిజానికి మైసూరా ఎన్నికలకు ముందే చేరాలనుకున్నారు. కాని ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీ కూడా నేతలతో ఫుల్లుగా నిండిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లినా పెద్దగా చేయగలిగిందీ లేదు…రాజకీయంగా తాను ప్రయోజనం పొందేది లేదన్నది ఆయన అభిప్రాయంగా వినపడుతోంది. అందుకే మైసూరా మనసు మార్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతా సవ్యంగా ఉంటే మైసూరా ఈపాటికి టీడీపీలో చేరిపోయేవారు. మూడు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు మైసూరా చేరికకు బ్రేక్ వేశాయంటున్నారు.
Leave a Reply