రివ్యూ: నా పేరు సూర్య

టైటిల్‌: నా పేరు సూర్య
బ్యాన‌ర్‌: రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌, అనూ ఎమ్యాన్యుయేల్‌, శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు
కెమేరా: రాజీవ్ ర‌వి
సంగీతం: విశాల్ శేఖ‌ర్‌
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు
నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్‌
ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
సినిమా నిడివి : 168 నిమిషాలు
విడుద‌ల తేదీ: 04 మే, 2018

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్‌లోనే స్కై రేంజ్ ఫామ్‌లో ఉన్నాడు. రేసుగుర్రం నుంచి డీజే వ‌ర‌కు బ‌న్నీ చేసిన సినిమాలు అన్ని టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించేస్తున్నాయి. బ‌న్నీ కెరీర్‌లోనే డిఫ‌రెంట్‌గా ట్రై చేసిన సినిమా నా పేరు సూర్య. ఓ ప‌వ‌ర్ ఫుల్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా బ‌న్నీ న‌టించిన ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ జంట‌గా న‌టించింది. వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా నిర్మించారు. కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం, అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్‌గా క‌నిపించ‌డంతో ఈ సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. దీనికి తోడు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. మ‌రి భారీ హైప్‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సూర్య ఏం చేశాడు ? అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకున్నాడు ? అన్నది తెలుగుపోస్ట్‌.కామ్ స‌మీక్షలో చూద్దాం.

సింగిల్ స్టోరీ లైన్ :

స‌రిహ‌ద్దులో ఉండే ఓ ఆర్మీ ఆఫీస‌ర్ సొసైటీలో అన్యాయాలు చూసి ఎలా స్పందిచాడు ? ఏం చేశాడు ? అన్నదే క‌థ‌.

స్టోరీ :

భారత్ – పాకిస్తాన్ బోర్డర్‌లోని డెహ్రడూన్ మిల‌ట‌రీ క్యాంప్‌లో ఆర్మీమేన్ సూర్య (అల్లు అర్జున్‌) ముక్కుసూటి మ‌నిషి. చిన్న కోపం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. ఎవ‌రు త‌ప్పుచేసినా కొట్టేస్తుంటాడు. ఈ క‌మ్రంలోనే ఓ ఆర్మీ ఆఫీస‌ర్‌ను కొట్టి స‌స్పెండ్ అవుతాడు. ఫ్యామిలీతో ప‌దేళ్లుగా దూరంగా ఉన్న సూర్య తండ్రి అయిన డీన్ రామ‌కృష్ణం రాజు (అర్జున్‌) సంత‌కం కోసం వ‌స్తాడు. అక్క‌డ ఈ ప‌దేళ్లలో వ‌ర్ష (అను ఎమ్మాన్యుయేల్‌)తో త‌న ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ గురించి తండ్రికి చెపుతాడు. చివ‌ర‌కు సంత‌కం చేసే క్రమంలో తండ్రితో అత‌డికి ఏర్పడిన వైరుధ్యం ఏంటి ? చ‌ల్లా (శ‌ర‌త్‌కుమార్‌) చేస్తోన్న అన్యాయాల‌కు సూర్య ఎలాంటి అడ్డుక‌ట్ట వేశాడు ? చివ‌ర‌కు సూర్య ఆర్మీ ల‌క్ష్యం ఏమైంది ? అత‌డి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా ? దేశ‌భ‌క్తి, జాతీయ స‌మైక్యత కోసం సూర్య ఏం చేశాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.

క‌థ‌నం & వంశీ డైరెక్షన్‌ విశ్లేషణ :

హీరోయిన్ త‌మ ప్రేమ, పెళ్లి విష‌యాన్ని తండ్రికి చెప్పాల‌నంటే హీరో వెళ్లి ఆమె పీక నొక్కేస్తూ ఆవేశ‌ప‌డిపోతుంటాడు. చాలా షార్ట్ టెంప‌ర్‌… చిన్న కోపాన్ని కూడా అణుచుకోలేడు… కోపం వ‌స్తే కొట్టేస్తానంటాడు… ఈ ఒక్క డైలాగ్‌తోనే హీరో కేరెక్టర్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఆర్మీలో ఉంటూ బోర్డర్‌కు వెళ్లాల‌ని ఏడేళ్లుగా క‌ల‌లు కంటోన్న హీరో కోపాన్ని ఏ మాత్రం అణుచుకోలేపోవ‌డంతో అత‌డు ప‌నిష్మెంట్లతో అక్కడే ఉంటాడు. చివ‌ర‌కు ఓ మంత్రి కొడుకును కొట్టినందుకు ఆర్మీ ఆఫీస‌ర్ రూ.25 వేలు లంచం అడిగాడ‌ని అత‌డిని కూడా కొట్టడంతో స‌స్పెండ్ అవుతాడు. తండ్రి సంత‌కం పెడితేనే మ‌ళ్లీ ఆర్మీ ఛాన్స్ వ‌స్తుంది. తండ్రికి, ఫ్యామిలీకి ప‌దేళ్ల పాటు హీరో దూరంగానే ఉంటాడు…. తండ్రి ప్రపంచంలోనే టాప్ సైకాల‌జీ ప్రొఫెస‌ర్‌…ఆయ‌న చిన్నప్పుడే కొడుకు ప్రవ‌ర్తన చూసి త‌ట్టుకోలేక దూరం చేసుకుంటాడు… మ‌రి కొడుకు ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చి సంత‌కం పెట్టమంటే ఎలా పెట్టేస్తాడు… అందుకు కొన్ని కండీష‌న్లు ఇలా సాగుతుంది నా పేరు సూర్య క‌థ‌నం.

గొప్ప కథేం కాదు….

వంశీ గ‌తంలో క‌థ‌లు అందించిన సినిమాలు చూస్తే గొప్ప క‌థ‌లేం కాదు…. కామోడీకి స్కోప్ ఉండ‌డంతో పాటు వాటిని ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. సురేంద‌ర్‌రెడ్డి, పూరి జ‌గ‌న్నాథ్‌, వంశీ పైడిప‌ల్లి వంశీ అందించిన రొటీన్ క‌థ‌ల‌కు కామెడీ, యాక్షన్ ట‌చ్ చేసి వాటిని ఎలివేట్ చేశారు. ఇక వంశీ మెగా ఫోన్ ప‌ట్టడంతో ఏదేదో చేస్తాడ‌ని ఊహించిన వాళ్లకు అస‌లు క‌థ‌తోనే వీక్ పాయింట్ ఎంచుకుని ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు ఎగ్జిట్ బోర్డు చూసేలా చేశాడు. ఆర్మీలో ఉండే సైనికుడు బోర్డర్‌కు వెళ్లాల‌నుకుంటాడు. చివ‌ర‌కు ఆ ల‌క్ష్యం ఏమైందో తెలియ‌దు.. హీరోయిన్‌తో బ‌న్నీ లాంటి హీరోకు ల‌వ్ సీన్లు ఉన్నాయంటే యూత్ అంతా ఆ ప్రేమ సీన్లలో త‌మ‌ను ఊహించుకునేలా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రం అవి పూర్తి ఊహా జ‌నితంగా ఉంటాయి. హీరో ఎవ‌రినో కొడతాడు… హీరోయిన్ ప్రేమ‌లో ప‌డుతుంది…. అత‌డి తీవ్రమైన కోపంతో వీరి ల‌వ్ బ్రేక‌ప్ అవుతుంది… చివ‌ర‌కు అత‌డు త‌న ఫ్యామిలీకి కూడా అదే అణుచుకోలేని కోపంతో దూర‌మ‌వుతాడు. బోర్డర్‌లోనూ అదే కార‌ణంతో స‌స్పెండ్ అవుతాడు…. ఈ కోపం అన్న కాన్సెఫ్టే త‌ప్ప సినిమాలే ఏం లేదు. చివ‌ర‌కు స‌డెన్‌గా అత‌డికి హీరోయిన్ మ‌ళ్లీ ద‌గ్గరైపోతుంది.

యావరేజ్ లోనే…..

సినిమా అంతా ప్లాట్ ఇంకా చెప్పాలంటే బిలో యావ‌రేజ్ పాయింట్ నెరేష‌న్‌లోనే ముందుకు వెళుతుంది. ఒక‌టి రెండు చోట్ల రైజ్ అవుతుంద‌ని అనుకుంటున్న టైంలోనే మ‌ళ్లీ గ్రాఫ్ చాలా దారుణంగా కింద‌కు ప‌డేది. తండ్రంటే కోపం స‌రే త‌ల్లి ప‌క్కనే ఉన్నా ఆమెతోనూ హీరో ఎందుకు మాట్లాడ‌డు… అస‌లు త‌ల్లితో అప్యాయ‌త ఏమైంది ? అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండ‌దు. ఇంట‌ర్వెల్‌కు ముందు సూర్య త‌న కొడుకు అని హీరో తండ్రి అర్జున్ ఏకంగా ఓ సెమినార్ ఏర్పాటు చేసి మ‌రీ చెప్పే సీన్ కూడా ఆక‌ట్టుకోలేదు.

కన్విన్సింగ్ గా లేదే…..

సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఉన్నా వాటి ప్లేస్‌మెంట్‌, డిజైన్ తీరు బాగోలేదు. ఆర్మీలో వ‌చ్చే ఫ‌స్ట్ ఫైట్ బాగుంది. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్లకు స్కోప్ వాటిని డిజైన్ చేసుకున్న విధానం, తెరమీద ప్రజెంట్ చేసిన తీరు నిరుత్సాహ‌ప‌రిచింది. ప్రేక్షకుడు ఏ ఒక్క సీన్‌లోనూ సినిమాకు క‌నెక్ట్ కాలేదు. సీన్లు వ‌స్తుంటాయ్‌…. వెళ్లిపోతుంటాయ్ ఆ వెంట‌నే వాటిని మ‌ర్చిపోతాడు. చివ‌ర్లో ఏదో సందేశం ఇద్దామ‌నుకున్న ద‌ర్శకుడు భార‌తీయ‌త‌, జాతి గురించి రాసుకున్న క్లైమాక్స్ కూడా పండ‌లేదు. తండ్రిని చంపేశార‌ని దేశం మీద ద్వేషంతో ఇళ్లు విడిచి వెళ్లిపోయిన అన్వర్ ఫేస్‌బుక్‌లో త‌న ఫొటో చూసి స‌డెన్‌గా ఇంటికి తిరిగి వ‌చ్చేయ‌డం ఏ మాత్రం క‌న్వీన్సింగ్‌గా లేదు.

డైరెక్షన్ పరంగా…..

క‌థా ర‌చ‌యిత‌గా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విష‌యంలో ఘోరంగా ఫెయిల్ వంశీ మాటల ర‌చ‌యిత‌గా మాత్రం కొన్ని మంచి మార్కులే వేయించుకున్నాడు. నీ లవ్ స్టోరీ వినాల‌నుంది … నువ్వు సిగ్గుప‌డేంత రొమాన్స్ ఉండ‌దు… మ‌హా అయితే వ‌య‌లెన్స్ ఉంటుంది – నువ్వు క‌ల‌గంటే పుట్టలేదు… కంటే పుట్టావు… క‌ల‌గంటే నీ లాంటి వాడు నాకు పుట్టడు – నువ్వు టెర్రరిస్టు అయ్యాక క‌లిశావు కాబ‌ట్టి చంపేస్తున్నా… అదే ముందు కలిసి ఉంటే టెర్రరిస్టు అవ్వాల‌న్న నీ ఆలోచ‌నే చంపేసేవాడిని – ప్రవ‌ర్తన మార్చుకోమ‌ని పాకిస్తాన్‌కే చాలా అవ‌కాశాలు ఇచ్చాము… మ‌నోడికి లాస్ట్ ఛాన్స్ ఇద్దాం లాంటి మాట‌లు కొన్ని బాగున్నాయి. డైరెక్షన్ మీద గ్రిప్ లేక‌పోవ‌డంతో వంశీ హీరో కేరెక్టరే కాదు… చుట్టు ప‌క్కల ఉన్న కేరెక్టర్లను కూడా స‌రిగా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. దీంతో పాత్రల మ‌ధ్య రిలేష‌న్‌, ఔచిత్యం పూర్తిగా దెబ్బ‌తినేసింది…. ప్రేక్షకుడు ఏ ఒక్క కేరెక్టర్‌కు కూడా పూర్తిగా క‌నెక్ట్ అవ్వలేదు.

న‌టీన‌టులు ఏం చేశారు…

న‌టీన‌టుల గురించి చెపితే ద‌ర్శకుడు ఒక్క హీరో అల్లు అర్జున్ కేరెక్టర్ మిన‌హా మిగిలిన ఏ కేరెక్టర్ స‌రిగా డిజైన్ చేయ‌లేదు. హీరో కేరెక్టర్ ఎలివేష‌న్ కూడా అంతంత మాత్రమే. హీరోయిన్ పాట‌లు, మూడు నాలుగు సీన్లలో మాత్రమే మెరిసింది. ఆమె న‌ట‌న‌కు స్కోప్ లేద‌నుకుంటే అందంతోనూ మెప్పించ‌లేక‌పోయింది. హీరో తండ్రి అర్జున్ కేరెక్టర్ జ‌స్ట్ ఓకే. అర్జున్ లాంటి సీనియ‌ర్ న‌టుడు ఉన్నా ద‌ర్శకుడు స‌రిగా వాడుకోలేదు. న‌దియాను ఎందుకు పెట్టారో తెలియ‌దు. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్ పాత్రల‌కు న్యాయం చేశారు. శ‌ర‌త్‌కుమార్ విల‌న్‌గా చేసిందేంటో తెలియ‌దు. అనూప్‌సింగ్ ఠాగూర్ కేరెక్ట‌ర్ సోసో… మిగిలిన వాళ్ల కేరెక్టర్ అంత గుర్తుండేవి కాదు.

సాంకేతికంగా ఎలా ఉంది….

సినిమాటోగ్రఫీ డ‌ల్‌గా ఉంది. సాంగ్స్ పిక్చరైజేష‌న్‌తో పాటు కొన్ని సీన్లు స‌రిగా రాలేదు. విశాల్ – శేఖ‌ర్ పాట‌ల క‌న్నా నేప‌థ్య సంగీతం బాగుంది. ఫ‌స్ట్ ఫైట్ బాగుంది. యాక్షన్‌కు ఎక్కువ స్కోప్ ఉండ‌డంతో ఫైట్లకు ప్రాధాన్యత ఎక్కువే. కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. ర‌న్ టైం మ‌రీ ఎక్కువ‌… సీన్లు సాగ‌దీశారు. అయినా డైరెక్షన్ ప‌రంగా వీక్ అవ్వడంతో కోట‌గిరి చేయ‌డానికి ఏం లేక‌పోయింది. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో సినిమా లాగించేశారు.

పాజిటివ్ అంశాలు (+):

– బ‌న్నీ ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌, డ్యాన్సులు
– సంగీతం
– ఫైట్లు
– హీరోకు తండ్రికి మ‌ధ్య ఉన్న రెండు మూడు సీన్లు

నెగిటివ్ అంశాలు (-):

– స్లో న‌రేష‌న్‌
– చాలా వీక్ స్టోరీ లైన్‌
– క‌థ‌, క‌థ‌నాలు
– క్యారెక్టర్లను, క‌థ‌నాన్ని ఎలివేట్ చేయ‌లేని వంశీ డైరెక్షన్‌
– సాగ‌దీత స‌న్నివేశాలు
– ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
– హీరోయిన్‌కు, విల‌న్ల‌కు స్కోప్ లేక‌పోవ‌డం

తుది తీర్పు :

సూర్యతో మెగా ఫోన్ ప‌ట్టిన వంశీ తొలి సినిమాతోనే బ‌న్నీ లాంటి పెద్ద హీరోతో చేసినా నిరుత్సాహ ప‌రిచాడు. మెయిన్ క‌థ‌తో పాటు క‌థ‌నం, డైరెక్షన్ వీక్‌. యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు రోటిన్ గా అనిపిస్తాయి. బన్నీ నుంచి వచ్చిన నా పేరు సూర్యపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేదు. మేజర్ గా కథ కథనంలో బలం లేకపోవడం వీక్ పాయింట్. క‌నీసం డీజే సినిమా బ‌న్నీ స్టామినాతో నెట్టుకొచ్చేసింది. నా పేరు సూర్యలో ఆ స్కోప్ కూడా లేదు.

 

నా పేరు సూర్య తెలుగుపోస్ట్‌.కామ్ రేటింగ్‌: 2.5 / 5

Ravi Batchali
About Ravi Batchali 40447 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*