
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఒకసారి ఒక పార్టీకి ఓటు వేస్తో మరొకసారి మరొక పార్టీకి ఓటు వేసే సంస్కృతి, సంప్రదాయం ఏపీ ఓటర్లకుందన్నది గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. ఫలితాలు వచ్చేందుకు మరో ఇరవై రోజులకు పైగానే సమయం ఉంది. అయితే అన్ని చోట్ల ఎవరిది గెలుపు? ఎవరిది ఓటమి? అన్న చర్చ జరుగుతుంటే… గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో ఎవరిని ఓడిస్తారు? అన్న చర్చ జరుగుతుండటం విశేషం. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎవరిని ఓడిస్తారన్నదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.
ఖచ్చితంగా చెప్పలేక….
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. కానీ తెనాలిలో మాత్రం జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ గట్టి పోటీ ఇవ్వడంతోనే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నాదెండ్ల మనోహర్ గెలుస్తారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. అయితే ఆయన ఎవరిని ఓడిస్తారు? అన్నది కూడా తేల్చలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మిగిలిన సామాజిక వర్గం ఓటర్లు ఎవరి వైపు చూశారన్నది తేలాల్సి ఉంది.
అదే ధీమా….
తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలోకి దిగారు. అలాగే వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ కు తన సొంత సామాజికవర్గంతో పాటు యువత, కాపు సామాజిక వర్గం అండగా నిలిచిందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు, రెడ్డి,కమ్మ సామాజికవర్గాలతో పాటు ఎస్సీ , బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరిలో అధికభాగం తనకు మద్దతుగా ఉన్నారని నాదెండ్ల మనోహర్ ధీమాగా ఉన్నారు.
వైసీపీకి అవకాశం ఉందా?
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గత ఎన్నికల్లో ఓటమి సానుభూతితో పాటు ఎస్సీ, బీసీలు, బ్రాహ్యణులు, వైశ్యులు తనకు అండగా నిలిచారని చెబుతున్నారు. తెనాలి పట్టణంలో వైశ్య ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచిన వీరు ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపారన్నది అన్నాబత్తుని ధీమా. ఎస్సీ ఓటర్లు కూడా తమవైపు ఉన్నారని ఈసారి ఖచ్చితంగా చట్ట సభలోకి అడుగుపెడతానని ధీమాగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సయితం సంక్షేమ పథకాలతో పాటు త్రిముఖ పోటీ తనను గట్టెక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద నాదెండ్ల మనోహర్ విజయావకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఆయన ఎవరిని ఓడిస్తారన్నదే మే 23వ తేదీన తేలనుంది.
Leave a Reply