
ఉమ్మడి రాష్ట్రం చివరి అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ ది ప్రత్యేక స్థానం. డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా తన పని తాను చూసుకుంటారనే పేరు ఆయన సొంతం. 2004, 2009లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పేరున్న ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లోనే ఉంటారా..? వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతారా..? అనే సందిగ్ధంలో ఉండగా ఆయన శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం కావడం చర్చనీయాంశమవుతోంది. ఒకదశలో వైఎస్సార్ కాంగ్రెస్ లో నాదెండ్ల చేరిక లాంఛనమే అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో… ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
వైకాపాలో చేరికపై ..?
నాదెండ్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన భేటీలోనూ ఆయన పాల్గొన్నారు. పార్టీ సైతం నాదండ్లకు ప్రాధాన్యత ఇస్తుంది. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో అనేక మంది నేతలు కాంగ్రెస్ ను వీడి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లినా నాదెండ్ల మాత్రం కాంగ్రెస్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అయినా నాలుగేళ్లుగా రాజకీయంగా ఎటువంటి నిర్ణయి తీసుకోలేదు. మరో ఆరునెలల్లో లేదా ఏడాదిలో ఎన్నికలు రానున్నాయనగా ఆయన రాజకీయ భవితవ్యం కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాదెండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు గతంలో ఆ పార్టీ ప్రయత్నించింది. నాదెండ్ల కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇప్పటికే తెనాలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. అందుకే ఆ పార్టీలో చేరికను నాదెండ్ల వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలంగా ఉన్న సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవాలనుకుంటున్న వైసీపీ అదే సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ ను పార్టీలోకి చేర్చుకుంటే తమకు ప్లస్ అవుతుందని ఆ పార్టీ భావించింది.
పోటీ ఖాయం… మరి ఏ పార్టీ నుంచి..?
రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసి గెలవాలని భావిస్తున్న నాదెండ్ల మనోహర్ జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే, జనసేనలో చేరికపై నాదెండ్ల మనోహర్ కానీ, జనసేన కానీ ఎటువంటి ప్రకటన చేయకున్నా, త్వరలోనే ఆయన తన రాజకీయ పయనంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో కోలుకునే అవకాశం లేనందున జనసేన నుంచి ఆయన పోటీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వైసీపీ కూడా ఆయనను పార్టీలో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కోలుకోలేని దెబ్బలు తిని, ఇప్పుడిప్పుడే కాప్త కుదుటపడుతున్న ముఖ్య నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Leave a Reply