
ఏపీలో అవసాన దశలో కునారిల్లుతోన్న కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గోవడం లేదు. కొద్ది రోజులుగా ఆయన వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ వీడే అంశంపై తన అనుచరులతో చర్చించిన ఆయన చివరికి జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపి జనసేనలో చేరుతున్నారని సమాచారం. జనసేనలోకి జంప్ చేసే మనోహర్ తెనాలి నుంచి ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల నాదెండ్ల వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినప్పుడు తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని… ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీని చూడాలనుకుంటున్నామని బల్లగుద్ది మరీ చెప్పిన మనోహర్ కొద్ది నెలలకే ప్లేట్ ఫిరాయించి జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
టీకాంగ్రెస్ నేతల అభ్యంతరంతో…..
నాదెండ్ల మనోహర్ సడెన్‌గా జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు అన్నదానిపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలే నడుస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు మారుస్తారని ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆయన్ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందని కూడా ప్రచారం జరిగింది. కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్స్‌తో పాటు కమ్మ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో మనోహర్ సైతం అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపారట. అయితే టీ-పీసీసీలో చాలా మంది స్థానికేతరుడు అయిన మనోహర్‌కు సీటు ఎలా ఇస్తామని పెండింగ్ పెట్టడంతో మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెనాలిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా గెలవనన్న ఉద్దేశంతోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
నాటి ఎన్నికల్లో……
సామాజిక సమీకరణల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మనోహర్‌కు క్లీన్ పొలిటీషియన్‌గా మంచి పేరే ఉంది. ఈ క్రమంలోనే జనసేనలో మనోహర్‌కు సామాజిక సమీకరణల నేపథ్యంలో కూడా మంచి ప్రయార్టీ ఉంటుందని తెలుస్తోంది.తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే మనోహర్‌కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు చీలడంతో పాటు తెనాలిలో 20 వేల వరకు ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లు, ఇతర కులాల ఓట్లు కొంత వరకు జనసేనకు డైవర్ట్ అయ్యి గెలవ వచ్చన్న అంచనాతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో 2009లో ప్రజారాజ్యం తెనాలిలో ఈ సీటును ప్రస్తుతం గుంటూరు వైసీపీ లోక్‌సభ సమన్వయకర్తగా ఉన్న కిలారు వెంకట రోశయ్యను రంగంలోకి దింపగా ఆయన ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే నాడు క్యాస్ట్ ఈక్వేషన్స్ బేలెన్స్ తప్పడంతోనే తెనాలిలో వైసీపీ అభ్యర్థికి ఊహించినదానికంటే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.
ఎంపీగానా? ఎమ్మెల్యేగానా?
ప్రస్తుతం తెనాలిలో వైసీపీ, టీడీపీల నుంచి కమ్మ అభ్యర్థులే పోటీ పడుతున్నారు. జనసేన నుంచి కూడా అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి పోటీ పడితే ఆ వర్గం ఓట్లు చీలడంతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు… ఇటు మనోహర్‌కు వ్యక్తిగతంగా ఉన్న ఓట్లుతో ఇక్కడ గట్టెక్కవచ్చని మనోహర్ ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. అదే టైమ్‌లో మనోహర్ గుంటూరు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీగా జనసేన నుంచి మనోహర్ బరిలో ఉంటే నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఉన్న కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు కాపులు మనోహర్ వ్యక్తిత్వం నేపథ్యంలో న్యూట్రల్ ఓటు బ్యాంకుతో ఇక్కడ కూడా బలమైన పోటీ ఇవ్వొచ్చని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది గుంటూరు ఎంపీ రేసులో కమ్మ సామాజికవర్గం నుంచి ఇప్పటికే గల్లా జయదేవ్ ఉన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఉంటే జయదేవ్ ఓటు బ్యాంకును భారీగా చీల్చుతారని కూడా అప్పుడే చర్చలు స్టాట్ అయ్యాయి. మరి ఎన్నికల వేళ ఈ సమీకరణలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.
Leave a Reply