
నాదెండ్ల మనోహర్ …. యువనేత. క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్. ఉమ్మడి రాష్ట్రం చివరి అసెంబ్లీలో స్పీకర్ గా నాదెండ్ల పనిచేశారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అలాంటి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయతను చూపుతూ వచ్చారు. ఎటువంటి వివాదాలకు ఆయన తన రాజకీయ జీవితంలో చోటు ఇవ్వలేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు.
రెండు పార్టీలనూ కాదని……
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. రాహుల్ గాంధీతో వివిధ సమావేశాలకు నాదెండ్ల హాజరయ్యారు. అయితే గత కొంతకాలంగా నాదెండ్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక కోలుకోలేదని భావించిన నాదెండ్ల మనోహర్ పార్టీ మారేందుకు రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే తొలుత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నాదెండ్ల రాకను ఆహ్వానించింది. అయితే అక్కడ అప్పటికే అన్నాబత్తుని శివకుమార్ ఉండటంతో నాదెండ్ల వెనక్కు తగ్గినట్లు సమాచారం.
మధ్యవర్తిత్వం ఆయనే…..
ఇక కొద్దిరోజుల క్రితం నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విజయవాడలో కలిశారు. సాధారణ విషయాలపై తాను పవన్ ను కలిశానని అప్పట్లో నాదెండ్ల చెప్పినప్పటికీ అప్పుడే ఆయన చేరికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కంటే కొత్తగా వచ్చిన జనసేనలో చేరడమే మేలని ఆయన భావించారు. విజయవాడలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పవన్ కు, నాదెండ్లకు మధ్య రాయబారం నడిపినట్లు సమాచారం.
రేపు తిరుపతిలో చేరిక…..
నాదెండ్ల రేపు తిరుపతిలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారనిచెబుతున్నారు. నిజంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాదెండ్ల చేరిక పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని జనసేన పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీలో నెంబరు 2 స్థానాన్ని నాదెండ్ల దక్కించుకుంటారని ఆయన వర్గీయులు సంబర పడుతున్నారు. తమపై ఇన్నాళ్లూ ఉన్న కులముద్ర నాదెండ్ల చేరికతో తొలగిపోతుందని జనసేన కూడా భావిస్తోంది. నాదెండ్ల లాంటి నమ్మకమైన వ్యక్తి కోల్పోయిన కాంగ్రెస్ ఇక ఎంతమంది పార్టీని వీడతారో లెక్కేసుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లే కన్పిస్తోంది.
Leave a Reply