జగన్ ఆఫర్ ను నాదెండ్ల ఎందుకు కాదన్నారు…?

ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీల నుంచి జంపింగులు ఊపందుకున్నాయి. రాజకీయాల్లో ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్‌ చిట్టచివరి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మనోహర్‌ జనసేనలో చేరినవెంటనే జనసేన నెంబర్ 2 మనోహరే అని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. జనసేనలోకి మనోహర్‌ చేరిక వల్ల ఆ పార్టీకి ఎంత మైలేజ్‌ వస్తుంది ? ఆయన వల్ల పార్టీకి ప్లస్‌ అవుతుందా ? లేదా మైనెస్‌ అవుతుందా ? అన్నదానిపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలే నడుస్తున్నాయి. వాస్తవంగా చూస్తే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన మనోహర్‌ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చి తాను సీఎం అవ్వడంతో ఆ ఫ్యామిలీపై తెలుగు రాజకీయ చరిత్రలో ఒక చెరగని బ్యాడ్‌ రిమార్క్‌ పడిపోయింది.

ఆ..బ్యాడ్ రిమార్క్ ను తొలగించుకునేందుకు……

1985 ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన సంఘటన తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన కెరీర్‌ అక్కడ తోనే దాదాపు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోహర్ తన కుటుంబంపై ఉన్నా ఆ బ్యాడ్‌ రిమార్కును తొలగించేందుకు తన వంతుగా ప్రయత్నం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ఎంతో నమ్మిన బంటుగా ఉన్న మనోహర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి శాసనసభకు డిఫ్యూటి స్పీకర్‌గానూ.. ఆ తర్వాత చివరి స్పీకర్‌గానూ పని చేసిన రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. శాసనసభ స్పీకర్‌గా ఆ పదవికే వ‌న్నె తెచ్చినవారిలో మనోహర్ ఖ‌చ్చితంగా నిలుస్తారు. సామాజిక సమీకరణల పరంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ జనసేనలో చేరడం ఆ పార్టీకి చాలా ప్లస్‌ అవుతుందని కొంత మంది చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మనోహర్‌ ప్రభావం తెనాలి నియోజకవర్గంలోనే ఉంటుందే తప్ప గుంటూరు జిల్లాలో సైతం ఆ ప్రభావం ఉంటుందని చెప్పడం కష్టం.

తెనాలి నియోజకవర్గంలో…..

తెనాలి నియోజకవర్గంలో పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కోట్లాది రూపాయ‌లతో అభివృద్ధి పనులు చేసిన మనోహర్‌కు ఆ నియోజకవర్గంలో మాత్రం సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా న్యూట్రల్‌ జనాల్లో సైతం మంచి అభిప్రాయం ఉంది. వివాద‌ రహితుడు, అవినీతికి దూరంగా ఉండే మనోహర్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. అయితే అది కేవలం తెనాలి వరకే పరిమితం అవుతుందే తప్పా గుంటూరు జిల్లాలో పక్క నియోజకవర్గాల్లోనూ నాదెండ్ల ఫ్యామిలీ ప్రభావం శూన్యమే. మనోహర్‌ సైతం జనసేనలో చేరితే తెనాలి నుంచి పోటీ చేసేందుకు మాత్రమే ఆసక్తితో ఉన్నారే తప్పా అంతకు మించి ఆయన అక్కడ ఆశించేది, చేసేది ఉంటుందన్నది కూడా అత్యాశే అవుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనోహర్‌ జనసేనలో చేరే ముందు వైసీపీలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చెశారు.

జగన్ పొన్నూరు టిక్కెట్ ఇస్తామనడంతో…..

వైసీపీ అధినేత జగన్‌ తెనాలి నుంచి కాకుండా పొన్నూరు నుంచి పోటీ చెయ్యాలని కోరడంతో… తన సొంత నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడని మనోహర్‌ చివరకు జనసేనలో చేరారు. ప్రస్తుతం గత ఎన్నికల్లో సైతం ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయినా కాంగ్రెస్‌తో తమకు ఉన్న అనుబంధం నేపథ్యంలో తెనాలిలోనే పోటీ చేసి కాస్త అటూ ఇటుగా 16 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని డిసైడ్ అయ్యి తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనను ఆశ్రయించక తప్పలేదని తెలుస్తోంది. ఏదేమైనా మనోహర్‌ జనసేనలో చేరినా ఆ ప్రభావం తెనాలి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుందన్నది స్పష్టంగా చెప్పవచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 34089 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*