
ఆంధ్రా ప్యారిస్‌గా పేరుండి రంగస్థలం, రాజకీయం, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ముందున్న తెనాలి నియోజకవర్గంలో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలయిన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల పోటీ తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే. కానీ జనసేన తరుపున మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతుండటంతో….ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక తెనాలి ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండటంతో…మూడు పార్టీల అభ్యర్ధులు పోటాపోటిగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ,వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరగ్గా వైసీపీ అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ పై టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు.
వ్యతిరేకత… సానుభూతి…..
ఈసారి కూడా ఆలపాటే టీడీపీ నుండి మరోసారి బరిలోకి దిగుతున్నారు. గత అయిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆలపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువయ్యేలా చేశారు. అయితే ఆలపాటి మీద భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆలపాటి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. అటు వైసీపీ నుండి గత ఎన్నికల్లో ఓడిపోయిన అన్నాబత్తుని శివకుమార్ ఈ సారీ పోటీలో ఉన్నారు. గతంలో ఓడిపోయిన సానుభూతి శివకుమార్‌పై ఉంది. అలాగే పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇక ప్రభుత్వం, ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకిత తనకి కలిసొస్తుందని శివకుమార్ భావిస్తున్నారు. కానీ టీడీపీ, జనసేన అభ్యర్ధులు స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో శివకుమార్ గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి.
జనసేనలో చేరి….
ఇక జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ రేసులోకి రావడంతో తెనాలి పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ నుంచి 2004,09 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2014 తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో కనుమరుగు అయ్యే స్థితిలో ఉండటంతో…ఆయన పవన్ కల్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం వలన జనసేనలో చేరారు. అయితే గతంలో రెండు సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ నాదెండ్లకి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ టీడీపీ, వైసీపీలకి ఉన్న క్యాడర్ జనసేనకి లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు.
బలమైన వర్గాలు…..
కాగా, తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. వీరు ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీరి తర్వాత పట్టణంలో వైశ్య, రూరల్ మండలాల్లో కాపు, రెడ్డి సామాజికవర్గాలు భారీగానే ఉన్నాయి. అయితే వైశ్యులు ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ ఉండగా… రెడ్డి, కాపు సామాజికవర్గాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారనేది బహిరంగ రహస్యమే. ఇక ఇక్కడ ఉన్న బీసీ వర్గాలు, మిగిలిన సామాజిక వర్గాలు ఎటువైపు ఉంటారనేది తెలియాల్సి ఉంది.
Leave a Reply