
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చిట్టచివరి ముఖ్యమంత్రి గా తెలుగురాష్ట్రవాసులకు అందరికి తెలుసు. అలాగే ఆయన లాస్ట్ బాల్ రెండు రాష్ట్రాల ప్రజలకు బాగా గుర్తుండిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన ఎట్టి పరిస్థితుల్లో జరిగేది లేదని ఎలాగైనా అడ్డుకుని తీరతామని ముఖ్యమంత్రి పదవిలో వుంటూ అధిష్టానంపై తిరుగుబాటు జండా ఎగురవేసిన కిరణ్ కుమార్ రెడ్డి చివరి బాల్ ఉందంటూ ఆంధ్ర ప్రజల్లో ఆశ కల్పించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తాము చేయాలిసిన పని చేసెయ్యడంతో చేసేది లేక పార్టీనుంచి బయటకువచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి పోటీ చేయకుండా దెబ్బ తిని స్కూల్ మూసేసిన సీఎం గా చరిత్రకెక్కారు. విభజనతో మౌనాన్ని ఆశ్రయించి నాలుగేళ్ళు రాజకీయ అజ్ఞాతంలో వున్న నల్లారి ఇప్పుడు కొడిగట్టిన కాంగ్రెస్ కి ఆశాదీపంలా కనిపించారు. దూతల రాయబారాలు ఫలించడంతో కిరణ్ తిరిగి తన పూర్వాశ్రమానికి చేరుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం రాహుల్ ను ప్రధానిని చేయడమే తన లక్ష్యమని అది జరిగితేనే రెండు తెలుగురాష్ట్రాలకు విభజన చట్టం, హామీలు అమలు జరిగి న్యాయం జరుగుతుందని ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యి అభివృద్ధి బాట పడతామని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
మిషన్ కిరణ్ అదేనా …?
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కి రాహుల్ అప్పగించిన బాధ్యతలు ఏమిటి ? ఆయన తక్షణ కర్తవ్యం ఏమిటి ? అంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన పాతకాపులందరిని వెనక్కి తీసుకురావడమే అన్నది స్పష్టం అయ్యింది. ఆ తరువాత తదుపరి లక్ష్యం పాతాళానికి పడిపోయిన పార్టీ ఓటు బ్యాంక్ ను వచ్చే ఎన్నికల్లో కనీసం 15 శాతానికి తీసుకురావడం. ఈ రెండిటిలో మొదటి పని చాలావరకు ఇప్పటికే పూర్తి అయ్యింది. కిరణ్ పిలిచినా పిలవకపోయినా కాంగ్రెస్ చెంత చేరేందుకు పలువురు మాజీ కాంగీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రెండో టాస్క్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో క్లిష్టమైనదే. రాష్ట్ర విభజన చేసిన గాయాలనుంచి ఆంధ్రా ప్రాంత ప్రజలు ఇంకా తేరుకోలేదు. రాష్ట్ర దుర్భర పరిస్థితికి తొలి ముద్దాయి కాంగ్రెస్ అని రెండో ముద్దాయి బిజెపి అన్నది ఇప్పటికి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి కేంద్రంలో వస్తే హామీలు అమలు చేసి తీరుతుందన్న నమ్మకానికి జనం రావడానికి మరోఐదేళ్లు పడుతుంది. టిడిపి, వైసిపి రాష్ట్రంలో బలంగా వున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలకు అంతంత మాత్రమే ఆంధ్రాలో ఓట్లు పడతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాక ఏ మేరకు కాంగ్రెస్ కి లబ్ది చేకూరుస్తుందో వచ్చే రోజుల్లో తేలిపోనుంది.
వచ్చినా పోయినా ఒక్కఓటు…
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి, టిడిపి నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఒక ఓటు కలుస్తుందని, బయటకు వచ్చేస్తే ఒక ఓటు పోతుందని వ్యంగ్యంగా తాజాపరిణామాలపై ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పొలిటీషియన్ కిరణ్ కుమార్ రెడ్డే నని మరో బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు వేరే ఏ నేత చేసినా అంతగా ప్రాధాన్యత ఉండేవి కావు. కిరణ్ మంత్రి వర్గంలో పనిచేసిన మాణిక్యవరప్రసాద్ చేసిన కామెంట్స్ కావడంతో దీనిపై చర్చ మొదలైంది. డొక్కా ఈ స్థాయిలో హాట్ కామెంట్స్ చేస్తారని ఏ ఒక్కరు ఊహించలేదు. కిరణ్ తో డొక్కాకు సఖ్యత ఉండేది కాదన్నది ఈ వ్యాఖ్యలతో తేలిపోయింది. కాంగ్రెస్ నేతల్లో వైఎస్ అనంతరం అంతర్గత విభేదాలు గతంలో తీవ్ర స్థాయిలోనే నడిచినట్లు స్పష్టం అవుతుంది.
కుట్రదారుడు కిరణ్ ….
కిరణ్ కి బద్ద విరోధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనదైన శైలిలోనే ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని విమర్శించారు. రాష్ట్ర విభజనలో ప్రజలను మోసం చేశారని ఆయనను కుట్రదారుడిగా ఆరోపించారు. మంత్రిగా కూడా పనిచేయకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కాంగ్రెస్ లో చేరడంవల్ల జరిగేది ఏమిలేదని తేల్చేశారు ఆయన. ఇలా కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే విమర్శలు ఆరోపణలు టిడిపి, వైసిపి నేతలనుంచి పెద్ద ఎత్తున రావడం దీనిపై విస్తృత చర్చ నడుస్తూ ఉండటం విశేషం.
Leave a Reply