
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరినది మొదలు పార్టీ నుంచి వెళ్లిపోయేవారు ఎక్కువయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరికతో మరింత బలోపేతం అవుతుందని భావించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పార్టీకి పెద్ద అస్సెట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఉన్న వాళ్లే వెళ్లిపోయే పరిస్థితి కన్పిస్తోంది. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసంతృప్తికి గురైన నేతలు ఆయన చేరికతో పక్క పార్టీల వైపునకు వెళుతున్నారన్న ప్రచారం ఏపీ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది.
30 మంది వస్తారంటూ….
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలో మరో 30 మంది వరకూ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలో చేరనున్నారని హస్తినలో ఆర్భాటంగా ప్రకటించారు. కాని నాలుగునెలలవుతున్నా ఒక్కనేతకూడా కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడలేదు. సరికదా ఉంటారనుకున్న వారు కూడా వెళ్లిపోతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతాడనుకున్నారు. ప్లీనరీ సమావేశాలకు కూడా వెళ్లివచ్చిన కొండ్రు మురళి స్థానిక రాజకీయాల కారణంతో పాటు కిరణ్ చేరిక వల్ల కూడా పార్టీని వీడినట్లు తెలుస్తోంది.
కిరణ్ ఉన్నందునేనా?
ఇక తాజాగా పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన తొలినుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చూపేవారు. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశానికి కూడా హాజరయి వచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పార్టీలో కీలక పదవి లభిస్తుందని భావించారు. నాదెండ్ల సామాజికవర్గానికి చెందిన వారికి పార్టీలో ప్రాధాన్యత లభిస్తుందనుకున్నారు. కానీ నల్లారి చేరికతో నాదెండ్ల ఆశలు అడియాసలయ్యాయంటున్నారు. కిరణ్ చేరిన తర్వాతనే నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ వీడాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఎదగలేమని భావించి……
కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతారు. అధిష్టానం వద్ద మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని తమను ఎదగనివ్వరన్నది పార్టీని వీడుతున్న నేతల ఆరోపణ. అంతేకాదు కిరణ్ వల్ల పార్టీకి వీసమెత్తు ప్రయోజనం కూడా ఉండదని, ఆయన సామాజికవర్గం ఓటర్లే ఆయనను నమ్మరన్నది కాంగ్రెస్ నేతల్లో ఎక్కువమంది అభిప్రాయం. అయినా అధిష్టానం కిరణ్ కు పెద్దపీట వేయాలని చూస్తుండటం వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ కు చెందిన రాయలసీమ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. కిరణ్ చెప్పినట్లు 30 నేతల మంది వచ్చే మాట దేవుడెరుగు కాని….ముగ్గురు నేతలు పార్టీలో మిగిలితే చాలంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.
Leave a Reply