నంద్యాల నరకం చూస్తోందే….!

నంద్యాల నరకం చూస్తోంది. ఎన్నికల హామీలు అమలు సాధ్యం కావడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నంద్యాల వాసులకు నరకప్రాయంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికలు జరిగి ఏడాది గడచి పోయింది. అయినా నంద్యాల వాసుల సమస్యలు తీరలేదు. ఉప ఎన్నికల సమయంలో ఊరించి…ఊరించి….వెళ్లిన మంత్రులందరూ ఇప్పుడు పత్తాలేకుండా పోయారని నంద్యాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు ఏడాది అవుతున్నా పూర్తి కాలేదు. దీంతో నంద్యాల ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.

రోడ్ల విస్తరణ పనులు….

నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో వైసీపీ పోటీకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికల సందర్బంగా నంద్యాలలో రోడ్ల విస్తరణను చేపడతామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. దాదాపు నంద్యాల చుట్టు పక్కల నుంచి 80 గ్రామాల ప్రజలు పట్టణానికి వస్తుంటారు. దీంతో రహదారులన్నీ ఇరుకుగా మారుతున్నాయి. అధికారపార్టీ రోడ్ల విస్తరణ చేస్తామని చెప్పడంతో నంద్యాల వాసులు ఆనంద పడ్డారు. భవనాలు కోల్పోయే వారికి నష్టపరిహారాన్నికూడా భారీగానే ప్రకటించారు.

అందమైన రోడ్లు వస్తాయని….

దీంతో నంద్యాల వాసులు తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని ఆశించారు. ఇరుకు రోడ్ల స్థానంలో వెడల్పయిన రహదారులు వస్తాయని ఆశపడ్డారు. ఎన్నికల సమయంలోనే రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పదుల సంఖ్యలో బుల్ డోజర్లువచ్చాయి. ట్రాక్టర్లు, జేసీబీలను తెప్పించి మరీ భవనాల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. ఇంకేముంది మనకు సుందరమైన రహదారులు వస్తాయని నంద్యాల ప్రజలు భావించారు. ఉప ఎన్నిక కంటే ముందుగానే రహదారి విస్తరణ పనులు పూర్తవుతాయని ఆశించారు.

పనులు కొనసాగుతూనే…..

కాని దాదాపు పది నెలల నుంచి రహదారి విస్తరణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు కిలోమీటర్ల ప్రధాన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడానికి పది నెలలసమయం అధికారులకు సరిపోలేదు. ఈ రహదారిలో కొంత 80 అడుగులు, కొంత 60 అడుగుల రోడ్లను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే 80 అడుగుల రోడ్ల విస్తరణ కోసం 166 మంది నుంచి భూసేకరణ చేశారు. వారికి 25 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 60 అడుగుల రోడ్లలో కొందరికి పరిహారం ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు. పూర్తిగా భవనాలను కోల్పోయిన వారికి మున్సిపల్ కాంప్లెక్స్ లో షాపులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మంత్రి అఖిలప్రియ, మున్సిపల్ మంత్రి నారాయణ వచ్చి పనులు పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నంద్యాల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ పనులు ఇలాగే కొనసాగతాయని ఎద్దేవా కూడా చేస్తున్నారు. మొత్తం మీద నంద్యాల వాసుల కల నెరవేరడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 22529 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*