
తెలుగుదేశం సర్కార్ పై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎంత సంతృప్తి అంటే 80 నుంచి 90 శాతం ప్రభుత్వ పనితీరుపై ప్రజలు మార్కులు వేస్తున్నారు. అంత సంతృప్తి దేశంలో ఏ రాష్ట్రంలో కనపడదు కానీ చిత్రంగా ఏపీలో మాత్రమే ఈ మార్కులు రావడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఇంతటి సంతృప్తి మూటగట్టుకున్న ఎపి సర్కార్ వాస్తవంగా ఎలాంటి ఎన్నికలు ఎదురొచ్చినా తొడగొట్టి నిలబడాలి పోటీకి ఎదురువెళ్ళే పరిస్థితి. కానీ మరో రెండున్నర నెలల తరువాత జరగాలిసిన పంచాయితీ ఎన్నికలను సాంకేతిక కారణాల సాకుతో వాయిదా వేయాలని ప్రభుత్వం భావించడంతో టిడిపికి ప్రజలు ఇచ్చిన మార్కులపై అనుమానాలు మొదలౌతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో మమత స్వీప్ చేసి …
ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా విజయకేతనం ఎగురవేసింది. వందలాది పంచాయితీలు ఏకగ్రీవం కాగా కాంగ్రెస్, బిజెపి లు నామమాత్ర పోటీ ఇచ్చాయి. ఇక కామ్రేడ్ లు అయితే దారుణ పరాజయాలు చవిచూశారు. అలాంటి మమత ప్రజల సంతృప్తి పై ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ లు ఏమి ఇవ్వలేదు. కానీ ఆమె విక్టరీ జనంలో దీదీ కి వున్న క్రేజ్ ను చెప్పక చెప్పడంతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పేస్తున్నాయి. తమ ప్రభుత్వం పై ప్రజలు నమ్మకంతో వున్నారంటే అది చూపించడానికి ఏ ఎన్నికలు వచ్చినా అధికారపార్టీలు చక్కగా వినియోగించుకుంటాయి. అభాసుపాలు అవుతామనుకుంటేనే ఎదో సాకుతో ఎన్నికలకు దూరంగా జరుగుతాయి.
అందుకేనా వాయిదా …
జులై చివరివారంలో వాస్తవానికి పంచాయితీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అయ్యింది. కానీ ఓటరు జాబితా ఇతర అంశాలను సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయించి అధికారుల పాలనతో నెట్టుకు రావాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి పైకి చెప్పే కారణాలు ఏమైనా అంతర్గతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రత్యర్థి పార్టీలు క్షేత్ర స్థాయిలో బలపడతాయనే ఆందోళన టిడిపి వర్గాల్లో వ్యక్తం కావడంతో పంచాయతీ ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వైసిపి, జనసేన పార్టీలు ఎన్నికల కోసం ఉత్సహంగా ఎదురు చూస్తున్నాయి.
జనసేన బలం పెరుగుతుందనా?
పార్టీ నిర్మాణంలో ఒక అడుగు ముందు వున్న వైసిపి కి గ్రామస్థాయిలో యంత్రాంగం వుంది. అదే జనసేనకు అయితే పార్టీ నిర్మాణమే లేదు. ఇప్పుడు ఏమాత్రం ఎన్నికలు జరిగినా గ్రామీణ స్థాయిలో గెలుపు ఓటములు ఎలా వున్నా ఈ రెండుపార్టీల నిర్మాణం బలంగా తయారు అవుతుంది. వీటితో పాటు బిజెపి సైతం పోటీలో సై అంటుంది. బూత్ స్థాయి యంత్రాంగాలు అన్ని పార్టీలకు ఏర్పడతాయి. ఏపీలో టిడిపి సర్కార్ ఉన్నందున అధికార పార్టీనే అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం కానీ ఈ మూడు పార్టీలు బూత్ స్థాయి క్యాడర్ తో సార్వత్రిక ఎన్నికలకు ముందే సర్వసన్నద్ధం కావడం అధికార పార్టీకి ఇరకాటం. అదే పంచాయితీ ఎన్నికల వాయిదాకు ఆఫ్ ది రికార్డ్ లో కారణమంటున్నారు విశ్లేషకులు.
Leave a Reply