ఏదిఏమైనా…. డోంట్ కేర్…!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశ‌ముంద‌నే ఊహాగానాలు పెరుగుతున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నిక‌లు అంటే 2019 ఎన్నికల‌కు ముందే ఎల‌క్షన్స్ నిర్వహించాల‌ని ఢిల్లీ పెద్దలు వ్యూహాలు ర‌చిస్తున్నార‌నే చర్చ ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. అయితే ఎప్పుడు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి? అనే ప్రశ్న అంద‌రిలోనూ మెదులుతోంది. సీఎం చంద్రబాబు.. విభ‌జ‌న హామీల విష‌యంలో బీజేపీని, ప్రధాని మోడీని ఇరుకున పెట్టి రాజ‌కీయ ప్రయోజ‌నాలు పొందేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

డిసెంబరు నెలాఖరులోనే…..

బీజేపీ నేత‌లు చెబుతున్న ప్రకారం.. డిసెంబ‌రు నెలాఖ‌రులోనే ఎన్నిక‌లు నిర్వహించే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. వివిధ రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయ‌ని స్పష్టంచేస్తున్నారు. అంటే ఇంకా ఉన్నది ఐదు నెల‌లు! మరి ఇప్పుడు ముంద‌స్తు వ‌ల్ల బాబుకు లాభ‌మా? న‌ష్టమా అనే చ‌ర్చ మొద‌లైంది. దేశ వ్యాప్తంగా మారిన రాజకీయాలతో సార్వత్రిక ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. మొన్నటి దాకా సాధారణ ఎన్నికలకు మరో 11నెలల సమయం ఉందని భావించిన రాజకీయ పార్టీలకు తాజాగా.. బీజేపీ వేస్తున్న ఎత్తులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలను 2018లోనే జరపాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దీంతో ఎన్నికల గడువుకు మరో నాలుగు నెలల ముందే ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీకి కూడా ముందుగానే…..

లోక్‌సభ ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమ‌వుతున్నార‌ట‌. వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాటిని సార్వత్రిక ఎన్నికలతోనే జరిపించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట‌. ఈ జాబితాలో ఏపీ కూడా ఉంద‌ట‌. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌లు మేలో జరగాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రాకు కూడా ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి. మరో ఐదు నెలల పాలనను వదులు కొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది.

లాభమా? నష్టమా?

నాలుగేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం.. అనుకోకుండా వస్తున్న ఎన్నికల వల్ల లాభపడుతుందా? లేక నష్టపోతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఆంధ్రాకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి మూడు నెల‌ల కింద‌ట టీడీపీ బయటకు వచ్చింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మోడీపై టీడీపీ నాయ‌కులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, నమ్మించి గొంతు కోశారని ఆరోపిస్తూ..ప్రజల్లో సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఆత్మవిశ్వాసంతో…….

ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందుగా వస్తే తమకే లాభం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ గెలుస్తుందన్న సర్వే ఫలితాలతో చంద్రబాబు ఖుషీగా ఉన్నార‌ట‌. ముందస్తు ఎన్నికలు తమకు మేలు చేస్తాయనే ఎక్కువ మంది నాయకులు న‌మ్ముతున్నార‌ట‌. ముంద‌స్తు వ‌చ్చినా త‌న‌కు వ‌చ్చే న‌ష్టమేమీ లేద‌నే ఆత్మవిశ్వాసంతో ఉన్నార‌ట‌. మ‌రి ఇది అతి విశ్వాసం కాకుండా ఉంటే మంచిద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముందుగానే వేడెక్కింది…..

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఏపీలో ఇప్పటికే ఆ పార్టీ ఏ మాత్రం నిర్మాణం వైపు దృష్టి సారించ‌డం లేదు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే జ‌న‌సేన ఎన్నిక‌ల ముందే చేతులు ఎత్తేయ‌డం ఖాయం. ఏమైనా పొత్తులు ఉంటే త‌ప్ప జ‌న‌సేన సంచ‌ల‌నాలు చేస్తుంద‌ని ఆశించ‌లేం. ఇక విప‌క్ష వైసీపీ అధినేత ఇప్పటికే సుదీర్ఘమైన పాద‌యాత్రలో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపీల రాజీనామాలు కూడా ఆమోదం పొందాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిశాక త‌క్కువ వ్యవ‌ధిలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా ముంద‌స్తు ఎన్నిక‌ల వార్తలు, ఏపీ ఎంపీల రాజీనామాల ఆమోదంతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ముందుగానే వేడెక్కింది.

Ravi Batchali
About Ravi Batchali 23601 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*