
రాష్ట్రంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన కీలక నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నాయకులు సైతం ఔరా అని నోరెళ్లపెట్టిన ఘటన జరిగిన ఎంపీ నియోజకవర్గం నంద్యాల. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అత్యంత ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ నుంచి అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫన ప్రముఖ పైపుల వ్యాపారి ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగారు. అదే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఫరూక్ పోటీ చేశారు. గట్టి పోటీ ఇచ్చిన ఈ ఎన్నికల్లో ఇద్దరూ కూడా నువ్వా-నేనా అనే రేంజ్లో పోటీ పడ్డారు. వాస్తవానికి అప్పటికే రెండు సార్లు వరుసగా ఇక్కడ ఎస్పీవై రెడ్డి గెలుపొందారు. అదికూడా భారీ మెజారిటీనే ఆయన కైవసం చేసుకున్నాడు. ఈ దఫా మాత్రం వైసీపీ నుంచి బరిలోకి దిగి.. విజయం సాధించాడు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరి…..
అయితే, రిజల్ట్ వెలువడిన వెంటనే వైసీపీ అధినేత జగన్ పట్ల కనీస మర్యాద, గౌరవం కూడా చూపించకుండా, టికెట్ ఇచ్చాడన్న కృతజ్ఞత కూడా లేకుండా వెంటనే వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిపోయాడు. అప్పటి నుంచి రెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాడు. నిజానికి ఇప్పుడు ఆయన ఆరోగ్యపరంగా తీవ్రం ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన తరఫున తన అల్లుడుని రాజకీయ రంగంలోకి దింపాలని నిర్ణయించుకు న్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా అల్లుడు శ్రీధర్‌రెడ్డిని ప్రజల్లోకి తెస్తున్నాడు.
నంద్యాల లోక్ సభకు…..
ఒక పక్క నంద్యాల నందిపైపుల వ్యాపారం, మరోపక్క రాజకీయంగా దూకుడు మీదున్న సమయంలోనే తన అవసరాలకు తగిన విధంగా పార్టీ మారిన ఎస్పీవై రెడ్డి.. ఇప్పుడు కూడా తన వ్యాపారాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన అల్లుడికి టికెట్ ఇచ్చేలా రంగం సిద్ధం చేసుకున్నాడు. తాజాగా .. నంద్యాల లోక్‌సభ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్ నియోజకవర్గాల నాయకులతో సీఎం మాట్లాడారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ పరిధిలోని నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తనకు పూర్తి అవకాశం ఇవ్వాలని సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి కోరినట్లు తెలిసింది.
ముసిముసినవ్వులు….
జిల్లాలో వైసీపీ నుంచి ప్రప్రథమంగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన వారిలో ఒకరికి నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని, గట్టి హామీ ఇస్తే ఇప్పటి నుంచే సన్నద్ధమవుతామని ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చంద్రబాబు ముసిముసిగా నవ్వినట్టు సమాచారం. దాదాపు ఈ టికెట్‌ను అందరూ ఊహించినట్టుగా శ్రీధర్‌రెడ్డికే ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే గతేడాది జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనే ఎస్పీవై రెడ్డి తన అల్లుడికి సీటు ఇవ్వాలని బాబుపై గట్టిగా ఒత్తిడి చేశారు. కొన్ని రోజులు అలక కూడా బూనారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గి ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు తన వంతుగా కృషి చేశారు. ఇక నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఎస్పీవై.రెడ్డికి ఉన్న పట్టు నేపథ్యంలో ఆయన అల్లుడు శ్రీధర్‌రెడ్డి అయితేనే వైసీపీ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్న నేతకు పోటీ ఇస్తాడని అంటున్నారు.
Leave a Reply