అంతుచిక్కడం లేదే….??

nara-chandrababu-naidu-analysis-on-defeat

ఇక మళ్లీ చంద్రబాబు సమీక్షలకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను అన్వేషించనున్నారు. ఫలితాలకు ముందు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలుగా సమీక్షలు జరిపి తర్వాత మానుకున్నారు. ఫలితాల తర్వాత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో తెలుగుతమ్ముళ్లలో నైరాశ్యం ఆవహించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు. అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబునాయుడు ఈ నెల 7వ తేదీన కుటుంబసభ్యలతో కలసి విదేశాలకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు విదేశాల్లో టూర్ చేయనున్నారు.

విదేశాల్లో ఏడు రోజులు…

ఏడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశాల్లో పర్యటించి వస్తారు. గత ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు అలుపెరగకుండా పనిచేశారు. ముఖ్యంగా ఎన్నికల కు రెండేళ్లు ముందు నుంచి కుటుంబ సభ్యులతో గడపలేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే కులూమనాలి వెళ్లి వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ నెల 14 తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. ఈ నెల 14వ తేదీ తర్వాత నుంచి  రోజుకొక పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఆ పరిధిలోని ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి.

లోతుగా అధ్యయనం….

ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు చంద్రబాబునాయుడికి ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. కనీస స్థానాలు వస్తే కొంత తృప్తిగా ఉండేది. ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఇంత అసంతృప్తి ప్రజల్లో ఉందన్న విషయాన్ని గమనించలేకపోయామని ఆయన ముఖ్యనేతల వద్ద ఆవేదన చెందినట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంకోసం తాను ఎంత కష్టపడినా ప్రజలు తనను అర్థం చేసుకోలేదని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అని అనుకుందామనుకుంటే… కొత్త అభ్యర్థులను పెట్టిన చోట కూడా దారుణంగా ఓటమి పాలయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

జగన్ పై సానుభూతి అని….

ఇక అయిందేదో అయిపోయింది…ఓటమి అంటూ బాధపడుతూ కూర్చోవడం కంటే జరిగిన తప్పులను సరిదిద్దుకోవడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీలోని ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని టీడీపీ బాస్ ఆలోచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని తనకు సకాలంలో చేరవేయడంలో ముఖ్యనేతలు కూడా విఫలమయ్యారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జరిపే సమీక్షల్లో ఏం చెప్పాలన్న దానిపై తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. వైఎస్ జగన్ పై సానుభూతి వల్లనే గెలిచారన్న వాదనను బలంగా బయటకు తీసుకొచ్చే అవకాశముంది టీడీపీ.

Ravi Batchali
About Ravi Batchali 32587 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*