బాబు బ్రెయిన్ వాష్ తోనైనా….?

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని అన్ని దారులనూ వెతుకుతున్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చంద్రబాబు ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామదర్శినిలో కొందరు నేతలు పాల్గొనడం లేదని నివేదికలు అందడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్రామదర్శినికి వెళితే ప్రజాసమస్యలను తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నా ఎందుకు కొందరు అలక్ష్యం చేస్తున్నారని కొందరి నేతలను నిలదీసినట్లు తెలిసింది.

విభేదాలతో సతమతమవుతూ…..

అలాగే పార్టీలో గ్రూపు విభేదాలను కూడా ఇక పక్కనపెట్టి సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో విభేదాలున్నాయి. ముఖ్యనేతల మధ్యే మాటలు లేవు. మంత్రుల మధ్యే సఖ్యత లేదు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశముంది. అందుకే చంద్రబాబు జిల్లాల వారీ సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి.

జిల్లాల వారీగా సమీక్షలు…..

ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు జరపాలని నిర్ణయించారు. అక్కడి ఇన్ ఛార్జులను, మంత్రులను కూడా ఈ సమీక్ష సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. వీలయితే అక్కడిక్కడే వారి మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని బాబు భావిస్తున్నారు.కర్నూలు జిల్లాలో ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య వార్ నడుస్తోంది. అలాగే ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్ ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. కడపలోనూ అదే పరిస్థితి. జమ్మల మడుతు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి, ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి, బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు పొసగడం లేదు. దీంతో అమరావతిలోనే నేతలందరికీ బాబు బ్రెయిన్ వాష్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

కొత్తగా చేరే నేతలపై…..

దీంతో పాటు కొత్తగా పార్టీలో చేరే నేతల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఈసమీక్షల్లోనే సంకేతాలను బాబు పంపనున్నారు. కొత్తగా పార్టీ చేరే వారిపై కొందరు తమ నియోజకవర్గంలోని అనుచరులతో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూడా చంద్రబాబు దృష్టికి వచ్చింది. అనేక నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళిని పార్టీలో చేర్చుకుంటుండటంతో మాజీ ఎమ్మెల్యే ప్రతిభా భారతి వర్గం భగ్గుమంటోంది. దీంతో ప్రతిభాభారతి లాంటి సీనియర్ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవ్వాలనినిర్ణయించారు. టిక్కెట్ వచ్చే అవకాశం లేని నేతలకు కూడా ఈ సమావేశాల్లోనే భవిష్యత్ పై చంద్రబాబు భరోసా ఇవ్వనున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 32444 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*