
ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక పక్క రాష్ట్ర సమస్యలు వెంటాడుతున్నాయి. మరోపక్క కేంద్రం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు. వీటితోనే ఆయన సతమతం అవుతున్నారు. అయితే, ఇంతలోనే ఆయనకు పార్టీలో నేతల కొట్లాటలు మరింత సమస్యగా మారాయి. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే, అదేసమయంలో పార్టీ నేతలు మాత్రం ప్రజల్లో తమ పరువుతోపాటు పార్టీ పరువును తీసేలా ఘర్షణలు పడుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారడం ఖాయమని చంద్రబాబుకు నివేదికలు అందాయి. దీంతో ఆయన అలెర్ట్ అయ్యారు. పార్టీని చక్కదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఘర్షణ పడుతున్న వారిని రాజధానికి పిలిచి క్లాస్ లు పీకుతున్నారు. అవసరమైన వారికి తలంటుతున్నారు.
చింతలపూడి మార్కెట్ కమిటీ…..
విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే పీతల సుజాతకు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఆమె మంత్రిగాఉన్న సమయం నుంచే ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. తన నియోజకవర్గం అంశాల్లో ఎంపీ మాగంటి వేలు పెడుతున్నారని సుజాత అనేక సందర్భాల్లో విమర్శించారు. ఈ క్రమంలోనే మాగంటి బాబు కూడా ఆమెపై విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో సుజాత ఒకరిని సిఫార్సు చేస్తే. మాగంటి బాబు మరొకరిని సిఫారసు చేశారు. దీంతో ఇప్పటి వరకు కమిటీ చైర్మన్ పదవి విషయంలో క్లారిటీ రాలేదు. ఈ పరిణామంతో ఇప్పటికీ కమిటీ చైర్మ్న్ లేకుండానే కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఆళ్లగడ్డలోనూ అంతే……
ఇక, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కోసం మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పదవి కోసం అడ్డొస్తున్న ఏవీని అఖిల ప్రియ తీవ్రంగా విభేదిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనపై రాళ్లదాడి కూడా జరిగింది. దీంతో వీరిమధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. దీంతో ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు బాబు.. వీరిని అమరావతికి రప్పించారు. ఇద్దరూ రాజీపడ్డామని బయటకు చెబుతున్నా వారి మధ్య ఇంకా విభేదాలు తొలగిపోలేదని అంటున్నారు. మీడియా సమావేశంలో ఇద్దరూ మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే, ఏవీ సుబ్బారెడ్డి తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోవడం దీనికి అద్దం పడుతుంది. ఆళ్లగడ్డ వివాదం మరోసారి రాజుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక, ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలోనూ రాజకీయ రచ్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో ముద్దు కృష్ణ ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. అధికారంలో లేకపోయినా.. నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారు.
గాలి కుటుంబ పంచాయతీ…..
అయితే, ఆయన ఇప్పుడు లేరు. ఆయన కుమారులకు గాలి ఎమ్మెల్సీ పదవిని అప్పగించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అయితే, సరిగ్గా ఇక్కడే వివాదం ముందుకు వచ్చింది.నిన్న మొన్నటి వరకు రాజకీయాలం టేనేగిట్టని గాలి చిన్న తనయుడు జగదీష్ తనకు ఎమ్మెల్సీ కావాలని, తనకు నగరి ఎమ్మెల్యే సీటు కావాలని గొడవకు దిగాడు. అయితే, నాన్న నన్నే తన రాజకీయ వారసుడిగా ప్రకటించాడు కాబట్టి, తానే ఎమ్మెల్సీ అవ్వాలనుకుంటున్నానని భానుప్రకాశ్ అంటున్నారు. వాస్తవంగా భాను గాలికి సరైన వారసుడు అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం వచ్చింది. అయితే, ఈ విషయంలో తమకు తాముగా ఓ నిర్ణయానికి వచ్చిన అన్నదమ్ములు.. ఇప్పటికీ ఖాళీగాఉన్న నగరి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి పదవిని తమలో ఒకరికి ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఏదో ఒకటి మాత్రమే ఇస్తానని తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఈ వివాదం ముదిరిపోతోంది. మొత్తంగా ఈ మూడు పంచాయతీలపై బాబు శుక్రవారం అమరావతిలో పంచాయితీలు పెడుతున్నారు. మరి వీటికి బాబు ఎలా పరిష్కారం చూపిస్తారో ? చూడాలి.
Leave a Reply