ఎవరు స్ట్రాంగ్ అంటే….?

ఒకవైపు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరికల జోరు ఊపందుకుంటుంటే…ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కన్పిస్తోంది. తెలంగాణ లో కేసీఆర్ నాయకత్వం, వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కన్పిస్తోంది. అందుకే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలు చేరుతున్నారు. వాస్తవానికి ఇక్కడ కారు పార్టీ కూడా ఓవర్ లోడ్ అయింది. అయినా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, తాజాగా దానం నాగేందర్ వంటి వారు చేరడంతో అధికార పార్టీ వైపు నాయకులు చూస్తున్నారని, ఇది కేసీఆర్ కు, ఆయన పార్టీకి పాజిటివ్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంకా నిలదొక్కుకోలేని స్థితిలో ఉంది. నాయకత్వ లోపం, సమన్వయం కొరవడటం, నేతల మధ్య విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారైంది.

పూర్తిగా భిన్నం…..

కాని తెలంగాణకు భిన్నమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కన్పిస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీకి చేరేందుకు నేతలు భయపడిపోతున్నారు. మూడునెలల క్రితం వరకూ ఆ పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కట్టారు. ఒకదశలో చంద్రబాబు కూడా పార్టీలో ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, విభేదాలను పక్కన పెట్టి ఇతర పార్టీల నేతలను చేర్చుకుని రాజకీయ పునరేకీకరణ జరపాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ద్వితీయ శ్రేణి నేతలను సయితం పార్టీలోకి చేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ముఖం చాటేస్తున్న నేతలు….

కాని పార్టీలో చేరతారని భావించిన సీనియర్ నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పార్టీలోకి రమ్మని స్థానిక నేతలు, మంత్రులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నా చూద్దాం అంటూ దాటవేసే పరిస్థితి ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో కన్పిస్తుండటం విశేషం. మైసూరా రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి వంటి నేతలు ఇప్పుడు మౌనపాత్ర పోషిస్తున్నారు. పార్టీలో చేరకపోగా కొందరు నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లడం కూడా అధినేత చంద్రబాబును టెన్షన్ పెడుతోంది. వసంత కృష్ణప్రసాద్, యలమంచిలి రవిలను ఎంతబుజ్జగించినా పార్టీని వదిలి వైసీపీలో చేరారు. మరో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

వైసీపీలోకి వెళ్లేందుకు….

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉండగా, ఏపీలో మాత్రం ప్రతిపక్షం బలంగా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో 2400 కిలోమీటర్లు నడిచారు. గత ఏడునెలలుగా ఆయన జనం మధ్యలోనే ఉన్నారు. సహజంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత, పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి నేతలు వైసీపీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో కొందరు నేతలు పార్టీలో చేరతారని ముఖ్యనేతల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ లలో కేసీఆర్ మాత్రం కొంత స్ట్రాంగ్ గా కన్పిస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Ravi Batchali
About Ravi Batchali 40484 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*