
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మరో సారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీస్తోందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో ఇతక పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని వారికి సీట్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందా ? టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్-3కి పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు… వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని ఆ పార్టీ తరపున పరిక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు ఎవరు ? ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఎవరి రాక కోసం వెయిట్ చేస్తోంది ? ఎన్నికలకు ముందు టీడీపీ స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్ ఆకర్ష్-3 వివరాలు ఏంటో తెలుగుపోస్ట్.కామ్ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఇప్పటికే రెండు విడతలుగా…..
ఏపీలో కూడా ఎన్నికల మూమెంట్ స్టార్ట్ అవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ఏపీలో రెండు విడతలుగా జరిగిన ఆపరేషన్ ఆకర్ష్‌లో విపక్ష వైసీపీ నుంచి విడతలవారిగా 22మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక తాజాగా ఎన్నికల ముందు జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్-3 ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి ని పార్టీలో చేర్చుకుని ఆయనకు రాజాం నియోజకవర్గ భాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఆపరేషన్ ఆకర్ష్-3లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేసే వ్యక్తులలో పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.
వీరిద్దరినీ లాగేసుకుందామని…..
విశాఖపట్నం జిల్లా నుంచి సబ్బం హరి, కొణతల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ భీమిలీ లేదా మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి నుంచి సబ్బం లేదా కొణతలలో ఎవరో ఒకరిని నిలబెడితే బలమైన అభ్యర్థిని అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక సమీకరణలను బట్టి సబ్బం హరికి విశాఖ నార్త్ అసెంబ్లీ సీటు కూడా ఇవ్వచ్చు అంటున్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్గా కూడా ఎవరినీ నియమించలేదు. ఇదంతా సబ్బం కోసమే అన్న చర్చ కూడా జిల్లాల్లో నడుస్తుంది.
డీఎల్ ను కూడా లైన్లోకి తెచ్చి……
కీలకమైన విపక్ష అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడప లోక్‌సభ కోటపై టీడీపీ జెండా ఎగరవేసేందుకు ఆ జిల్లాలో ప్రజాదారణ ఉన్న మాజీ మంత్రి డీఎల్. రవీంద్రా రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ ఫ్యామిలి వ్యతిరేఖిగా గుర్తింపు పొందిన రవీంద్రా రెడ్డితో టీడీపీ నాయకులు చర్చలు జరుపుతున్నా ఆయనకు పార్టీ నుంచి సరైన హామీ లేకపోవడంతో పాటు మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ అడ్డు తగులుతుండడంతో డీఎల్ టీడీపీ ఎంట్రీ వాయిదా పడుతూ వస్తోంది. డీఎల్‌ను పార్టీలోకి ఆహ్వానించి మైదుకూరు అసెంబ్లీ బరిలో దింపాలా ? లేదా కడప ఎంపీగా దింపాలా ? అన్న చర్చలు నడుస్తున్నాయి. అలాగే మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లాల్లో శింగనమలలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
శైలజానాథ్ కూ గాలం…..
శైలజానాథ్ పార్టీలోకి వస్తే ఆయనకు శింగనమల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి క్లియర్‌గా తెలుస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కూడా చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. ఇక ఉత్తరాంధ్రలో మరో కీలక నేత దాడి వీరభధ్రరావు లాంటి నేతలను కూడా ఆపరేషన్ స్వగృహ పేరుతో పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీలో ఆయనతో సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ నుంచి ఏకంగా 22మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో టీడీపీలో ఓవర్ లోడ్ అయ్యింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగే ఛాన్సులు లేకపోవడంతో వీరందరికీ ఎక్కడ సీట్ల సర్దు బాటు చెయ్యాలని బాబు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరికొంత మంది చేరికలతో ఈ ఆపరేషన్ ఆకర్ష్-3 టీడీపీకి ఎంత వరకూ సత్ఫలితాన్ని ఇస్తుంది… ఇది ఏ మెరకూ సక్సెస్ అవుతుందో ? తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.
Leave a Reply