
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలో ఒకటి మాత్రం నిజం. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించలేదు. నిత్యం వివిధ పనుల్లో బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ శాఖ బాధ్యతలను ఎందుకు చూస్తున్నట్లు? నిజమే కదా? మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖ వైద్య, ఆరోగ్య శాఖ. ప్రజాజీవితంలో ఆరోగ్య భద్రతను కల్పించాల్సింది ప్రభుత్వమే. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సింది సర్కార్ మాత్రమే. కాని నెలలు గడుస్తున్నా ఆ శాఖకు మంత్రి లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.
కామినేని రాజీనామాతో…..
నెలన్నర క్రితం వరకూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు మంత్రిగా కామినేని శ్రీనివాస్ ఉండేవారు. అయితే రాష్ట్రంలోనూ,కేంద్రంలోనూ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. విభజన హామీలు అమలు చేయడం లేదని, ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందడం లేదని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కటీఫ్ చెప్పారు. తన పార్టీకిచెందిన సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజుల చేత కే్ంద్రమంత్రి పదవులకురాజీనామా చేయించారు. దీంతో ఏపీ మంత్రివర్గంలో ఉన్న కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు కూడా రాజీనామాలు చేయాల్సి వచ్చింది.
నెలలు గడుస్తున్నా…..
అయితే మంత్రి పదవులు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా వాటిని ఇంతవరకూ చంద్రబాబు భర్తీ చేయలేదు. ఏడాది క్రితం జరిపిన మంత్రి వర్గ విస్తరణతో పార్టీలో అసంతృప్తి పెల్లుబుకింది. ఎన్నికల ముందు మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిపి పార్టీలో అసమ్మతి గళాలకు చోటివ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖను తనవద్దనే ఉంచుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కామినేని శ్రీనివాస్ వివిధ ఆసుపత్రులను సందర్శించి వాటి పరిస్థితులను సమీక్షించేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
పవన్ లేవనెత్తడంతో…..
వైద్య, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను చర్చించాలన్నా, నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. కాని చంద్రబాబు అంత సమయం కేటాయించకపోవడంతో ఆ శాఖలో ఫైళ్లు పేరుకుపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో మరోసారి చర్చ ప్రారంభమైంది. ఉద్దానంతో పాటు రాష్ట్రంలో వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా పోయిందని పవన్ దుయ్యబట్టారు. ఏపీలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
Leave a Reply