
ఏపీ సీఎం చంద్రబాబు అంత త్వరగా ఎవరినీ నమ్మరు.. కానీ నమ్మితే వారిని అందలమెక్కిస్తారు. అలా నమ్మి నెత్తిన ఎక్కించుకున్న వ్యక్తి.. ఏకులా వచ్చి మేకులా మారాడు. పక్కన పెట్టుకుంటే పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయన్ను పార్టీలోకి తీసుకొస్తే.. ఇప్పుడు సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నాడు. పార్టీ కండువా వేసుకుంది మొదలు.. మంత్రి అయ్యే వరకూ ఎన్నో విధాలుగా లబ్ధి పొందిన ఆయన.. చివరికి పార్టీకి చేసిన మేలు ఏమైనా ఉందా? అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. పైగా తన దురుసు వ్యాఖ్యలతో టీడీపీని మరింత ఇబ్బందుల్లో పడేశారు. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోలేక చంద్రబాబు సతమతమవుతున్నారు. మరి బాబుకు అంత గుదిబండలా మారిన వ్యక్తి మరెవరో కాదు ఫిరాయింపు కోటాలో మంత్రి అయిపోయిన ఆది నారాయణరెడ్డి!!
చంద్రబాబు ఒకటి తలిస్తే…..
కడప జిల్లాలో జగన్ ఆధిపత్యానికి గండి కొట్టాలని చంద్రబాబు ఎప్పటినుంచో వేచిచూస్తున్నారు. ఆ జిల్లాలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కొంత వరకూ పైచేయి సాధించాలనే వ్యూహాలు రచించారు. ఇందులో పడిన తొలి వికెట్ జమ్మలమడుగు ఆది నారాయణ రెడ్డి! ఆ నియోజకవర్గంలో రాజకీయంగా రామసుబ్బారెడ్డికీ, ఆదికీ మధ్య వైరం ఉన్నా.. ఒకే ఒరలో రెండు కత్తులు అమర్చే సాహసం చేశారు చంద్రబాబు. ఆది చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన రామ సుబ్బారెడ్డి వర్గాన్ని శాంతింపజేశారు. అయితే వీరి మధ్య విభేదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అనంతరం ఆదికి మంత్రి పదవి ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో తనకు తిరుగులేదు అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు ఆది. మరి రామ సుబ్బారెడ్డి వర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చి అప్పటికి శాంతింపజేశారు.
బాగానే లబ్ది పొంది…..
వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి.. టీడీపీలో చేరడం తర్వాత మంత్రి అవడం శరవేగంగా జరిగిపోయాయి. ఇది ఆదినారాయణకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చేసింది. మొదటిది వియ్యంకుడు కేశవరెడ్డిని ఇబ్బందుల నుంచి బయటపడేయడం, ఇక రెండోది ఫిరాయింపుతో ఒక్కసారిగా అధికార పక్షం అయిపోవ డం ఆపై మంత్రిపదవి దక్కడం. ఇలా ఎలా చూసినా చాలా లబ్ధిపొందారు. మరి టీడీపీకి ఆదితో కలిగే లాభం ఏమిటి? అంటే ఒక్క జగన్ మీద అడ్డగోలుగా మట్లాడటానికి ఒక రెడ్డి నేత దొరికాడు అనే ఆనందం తప్ప ఒరిగింది లేదు.ఇప్పుడు ఆదినారాయణరెడ్డి పుణ్యమా అని తెలుగుదేశం పార్టీలో కొత్త రచ్చలు రేగడం ఆసక్తిదాయకంగా మారుతోంది. ఆదినారాయణ రెడ్డికి అహంకారం అంటూ మరోసారి విరుచుకుపడ్డాడు సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదే అని ఆది ప్రచారం చేసుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.
ఒక నియోజకవర్గం కాదు…..
దీనిని బట్టి చూస్తే ఒకవేళ చంద్రబాబు మళ్లీ జమ్మలమడుగు టికెట్ ఆదికే ఇచ్చినా, సుబ్బారెడ్డి టీడీపీలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదికి సహకరించడనేది తేలిపోయింది. ఇక ఆదినారాయణ రెడ్డి కేవలం జమ్మలమడుగుకే పరిమితం కావడం లేదు. బద్వేల్ రాజకీయాల్లోనూ వేలు పెడుతున్నాడట. అక్కడ వైసీపీ నుంచి తనతో పాటు ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్నాడట. తన అనుచరులను అక్కడ నుంచి పోటీ చేయించుకోవాలనేది ఆది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రొద్దుటూరు పంచాయితీలోనూ ఆది జోక్యం మొదలైంది. ఫిరాయించి వచ్చిన ఆదిని నెత్తిన పెట్టుకుని అందలమెక్కించినందుకు చంద్రబాబుకు కునుకు లేకుండా చేసేస్తున్నారు. చర్యలు తీసుకున్నా.. అది మళ్లీ రాజకీయంగా దెబ్బ కొడతాయేమోననే ఆందోళన కూడా ఎక్కువవుతోందట.
Leave a Reply