
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇదే అదను. తమలోఉన్న అసంతృప్తిని బయటకు కక్కేందుకు ఇదే మంచి టైమింగ్. ఇప్పుడు జర్క్ ఇస్తేనే ఎవరైనా తలొగ్గుతారు. ఇలా ఉంది తెలుగుదేశం పార్టీలో నేతల పరిస్థితి. అధిష్టానాన్ని ఎంత బతిమాలినా….ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఫలించనవి ఎన్నికలకు ముందు పంచాయతీ పెడితే నెరవేరిపోతాయన్నది తెలుగుతమ్ముళ్ల ఆలోచనగా ఉంది. ఇలా తెలుగుదేశం పార్టీ నేతల అలకలు, అసంతృప్తులు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం, మరోవైపు ప్రతిపక్ష నేత పాదయాత్ర పేరుతో ప్రజల్లోనే ఉండటంతో చంద్రబాబు గత కొద్ది రోజులుగా కొంత ఆందోళనలో ఉన్నారు.
ఎడతెగని పంచాయతీలు….
ఈ సమయంలో ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజలకు చేరువై మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటుపరిపాలనాపరంగా అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పార్టీని కూడా గాడిన పెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబుది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నేతల కలహాలు చంద్రబాబు నాయుడుకు అంతుచిక్కడం లేదు. ఒకటి పోతే మరొకటి ఇలా వరుసగా పంచాయతీలు వస్తుండటంతో చంద్రబాబు చికాకుకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు నెలలు ఆగితే ఎన్ని పంచాయతీలు చేయాల్సి ఉంటుందోనన్న బెంగ పట్టుకుంది టీడీపీ అధిష్టానానికి.
అసంతృప్తులు…అసమ్మతులు….
మొన్నటి వరకూ ఆళ్లగడ్డ పంచాయతీతో సరిపోయింది. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి పడకపోవడం, వీధుల్లోకి ఎక్కి రచ్చ చేసుకోవడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇద్దరినీ పిలిపించుకుని రెండు రోజుల పాటు పంచాయతీ చేసి చివరకు ఏమీ తేల్చకుండానే పంపించేశారు. ఇప్పుడు అక్కడ పార్టీ కోసం ఇద్దరూ కలసి పనిచేసే పరిస్థితి లేదనేది వాస్తవం. ఇక కర్నూలు జిల్లాలోని బనగానిపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కూడా అలకబూనారు. మహానాడుకు హాజరు కాకుండా తన నిరసనను తెలియజేశారు. అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ప్రూఫ్ లతో సహా చూపెడుతున్నారు. దీంతో చంద్రబాబు బీసీ జనార్థన్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడి పంపించాల్సి వచ్చింది.
దారికి తెచ్చుకోవాలనేనా?
తాజాగా గంటా శ్రీనివాసరావు వ్యవహారమూ అంతే. చినరాజప్ప గంటాను బుజ్జగించినప్పటికీ ఆయన మనస్సులో నుంచి పూర్తిగా అసంతృప్తి తొలిగిపోలేదని చెబుతున్నారు. అయిష్టంగానే గంటా ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు, మూడురోజుల్లో గంటా వ్యవహారంపై అమరావతిలో చంద్రబాబు పంచాయతీ చేయనున్నారు. అలాగే ప్రకాశంజిల్లానేత కరణం బలరాం కూడా ముఖ్యమంత్రికి ముఖం చాటేస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు జరిపిన జిల్లా సమీక్ష సమావేశానికి కరణం బలరాం డుమ్మా కొట్టారు. ఇలా వరుసగా నేతలు అలకపాన్పులు ఎక్కతుండటంతో చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. మొత్తం మీద సమయం ఇదే చంద్రమా అంటూ తెలుగు తమ్ముళ్లు అధినేతను తమ గుప్పిట్లో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తోంది.
Leave a Reply