బాబోయ్ బాబు ఇలా చేశారేంటి?

చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది…లోక్ సభలో ఏకబిగిన సుదీర్ఘ చర్చ…. ఆ తర్వాత ప్రధాని గంటన్నర ప్రసంగం ముగిశాక జరిగిన వోటింగ్ లో అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126., వ్యతిరేకంగా 325 ఓట్లు లభించాయి. ఇంతవరకు బాగానే ఉంది. అవిశ్వాస తీర్మానం జరిగిన విధానాన్ని వివరించేందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబు వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు టీడీపీ ఎంపీలకు సూచినలిస్తూ గడిపారు. రాత్రి 11.30కు వెలగపూడి సచివాలయం కాన్ఫరెన్సు హాలుకు రాగానే కొంత మంది మీడియా ప్రతినిధులు ఆయన్ని తప్పు దారి పట్టించారు. లోక్ సభలో అసలు అవిశ్వాస పరిక్షే జరగలేదని., జరిగింది విశ్వాస పరిక్షని ఆయన చెవిలో ఊదారు.

తప్పుదోవ పట్టించిన……

ఆయన గందరగోళంలో ఉండగానే అసలు సభలో జరిగింది వేరు స్పీకర్ తప్పుగా మాట్లాడారు కాబట్టి., సాంకేతికంగా టీడీపీ నే గెలిచింది అని ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించారు. ప్రభుత్వ అనుకూల పత్రిక తో పాటు ప్రభుత్వమే తమదిగా భావించే ఓ వర్గం మీడియా ప్రతినిధులు వంత పాడటంతో సీఎం కూడా నిజమే అని భావించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ మొదలైనా., సీఎం ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో కాగితంపై రాసి ఆయనకు అందించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా అసలు సభలో స్పీకర్ ఏమి మాట్లాడారో స్పష్టత లేదు., ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి అని ప్రకటించేశారు. ఇంతకు లోక్ సభలో జరిగిన వోటింగ్ తెలుగు మీడియా ప్రతినిధులకు అర్థం కాక., సొంత అన్వయం ఇచ్చేసారు. వారికి సీఎం ఓ లో పని చేసే అధికారి కూడా ఒకరు వంత పాడటంతో సీఎం నమ్మాల్సి వచ్చింది. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో కేంద్ర మంత్రి వర్గంపై విశ్వాస పరీక్ష నిర్వహించాలని సభ్యులు కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు అవును., కాదు అని చెప్పడం ద్వారా తమ అభిప్రాయం తెలపాలని స్పీకర్ సూచించారు. తొలుత వోట్ వేయడంలో సభ్యులు తికమక పడటంతో లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఓటు ఎలా వేయాలో వివరించారు. ఆ తర్వాత మళ్ళీ డివిజన్ కి వెళ్లి ఓటింగ్ నిర్వహించారు. సభలో ఉన్న వారిలో 451 మంది ఓటు హక్కు నియోగించుకున్నారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరిగినా ఓ బ్యాచ్ ముఖ్యమంత్రి ని నమ్మకంగా తప్పుదోవ పట్టించి తమ అజ్ఞానం బయట పెట్టుకున్నారు.ముఖ్యమంత్రి చంద్ర బాబు సైతం ఇలా మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్లనే అక్కున చేర్చుకుని అభాసు పాలవుతున్నారు.ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే బాబుని ఎవరు కాపాడలేరు. ఇక శనివారం ఢిల్లీలో కూడా బాబు ఇదే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి భజన బృందం నేషనల్ మీడియా ముందు కూడా బాబుని తప్పు దోవ పట్టించారు.

నేను రెడీ….

అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాటపట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు టీడీపీకి మద్దతునిచ్చాయి. శిరోమణి అకాలీదళ్., ఆమ్ అద్మీ పార్టీ., ఏఐయుఎల్ఎం., జేఎంఎం., కాంగ్రెస్ వంటి పార్టీలకు కృతజ్ఞతలు తెలిపేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అయితే శని., ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ఏ పార్టీ నాయకులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కానిస్టిట్యూషన్ క్లబ్ లో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. అంత వరకు బాగానే ఉన్నా మీడియా సమావేశం తర్వాత చిట్ చాట్ లో జాతీయ రాజకీయాలపై బాబు వైఖరిని ప్రస్తావించారు. ప్రధాని పదవిపై ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో బాబు అప్పట్లో తమ బలం వేరు., ఇప్పుడు పరిస్థితులు వేరని వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు 42లోక్ సభ స్థానాలలో 35కు పైగా తమ పార్టీ గెలుచుకుందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బలం ఇప్పుడు 25కు పరిమితమని, జాతీయ రాజకీయాలలో సమయం వచ్చినపుడు తమ స్పందన ఉంటుందని చెప్పారు. ప్రధాని బాధ్యతలు చేపడతారా అని ప్రశ్నిస్తే అవసరమైతే దేశానికి సేవ చేయడానికి తానెప్పుడు సిద్ధమని బాబు ముసిముసి నవ్వులు నవ్వారు. అంటే టైం వస్తే పీఎం పీఠం ఎక్కేస్తారా అనుకుంటూ ముఖాలు చూసుకోవడం మీడియా వంతైంది.

Ravi Batchali
About Ravi Batchali 30935 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*