వైసీపీ నుంచి వస్తే….ఫట్….!!

వైసీపీ నేతలు అడియాశలే అవుతాయా? ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నేతలకు మంత్రి వర్గం లో ఛాన్స్ లేదని తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీ మంత్రులు వెళ్లిపోయాక రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖతో పాటు దేవాదాయశాఖ మంత్రి పదవి ఖాళీగా ఉంది. అయితే ఇప్పటివరకూ కేబినెట్ లో లేని ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. వీరికోసమే మంత్రి వర్గ విస్తరణ జరుపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.

మైనారిటీ, ఎస్టీలకు…..

మైనారిటీల నుంచి మంత్రిగా తీసుకోవాలంటే ఒకరు శాననమండలి ఛైర్మన్ కాగా, మరొకరు ఎమ్మెల్సీ షరీఫ్. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. మరొకరు వైసీపీ నుంచి వచ్చిన చాంద్ భాషా. అలాగే ఎస్టీలకు అవకాశం కల్పించాలంటే మూడు పేర్లు విన్పిస్తున్నాయి. కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ముడియం శ్రీనివాసరావు. ఇందులో గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరగా, ముడియం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మాత్రం తెలుగుదేశం పార్టీ గుర్తుపై గత ఎన్నికల్లో గెలిచారు. ముడియం శ్రీనివాసరావు పోలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వారిద్దరి వైపే……

ఇందులో మైనారిటీ మంత్రి విషయంలో ఎమ్మెల్సీ షరీఫ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్.ఎం.డి. ఫరూక్ ఇప్పటికే శాసనమండలి ఛైర్మన్ గా ఉండటంతో ఆయనకు అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. అలాగే చాంద్ భాషాకు ఛాన్సే లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అలాగే గిరిజన కోటా కింద ముడియం శ్రినివాసరావుకే ఎక్కువగా అవకాశాలున్నాయని చెబుతున్నారు. షరీఫ్, ముడియం శ్రీనివాసరావు పేర్లపై ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు సీనియర్ నేతలతో దీనిపై చర్చించినట్లు చెబుతున్నారు.

గవర్నర్ అంగీకరిస్తారా?

ఇప్పటికే గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో నలుగురు వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రిపదవులు దక్కాయి. సుజయ కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ, అమర్ నాధ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీలోనూ, బయటా విమర్శలు వచ్చాయి. వీరిని మంత్రివర్గంలో తీసుకున్న దగ్గర నుంచి వైసీపీ అసెంబ్లీ సమావేశాలకూ దూరమయింది. అంతేకాకుండా ఇప్పుడు గవర్నర్ కూడా అంగీకరించే పరిస్థితి ఉందా? లేదా? అన్నది అనుమానమే. అప్పట్లో కేంద్రంతో సత్సంబంధాలుండటంతో వైసీపీ గుర్తు మీద గెలిచిన వారితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పుడు గవర్నర్ అందుకు అంగీకరించరన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. విమర్శలను ఎదుర్కొంటూ రిస్క్ తీసుకోవడం ఎందుకని వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని సమాచారం. దీంతో టీడీపీకి చెందిన షరీఫ్, ముడియం శ్రీనివాసరావులకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40447 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*