
టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. అంత బలమైన సంస్థాగత నేపథ్యం ఉన్న జిల్లాలో ప్రస్తుతం టీడీపీ చాలా నియోజకవర్గాలో ఎదురీదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ అనంతపురం, హిందూపురం రెండు లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఉరవకొండ, కదిరి మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో జైకేతనం ఎగరవేసింది. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడింది.
ఎదురీత తప్పదా….?
ఉరవకొండలో పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోగా, కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ 700 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో చాంద్ బాషా సైకిల్ ఎక్కేయ్యడంతో ప్రస్తుతం వైసీపీకి జిల్లాలో ఒక్క ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాత్రమే ఉన్నారు. జిల్లాలో అన్ని స్థానిక సమస్యల ఎన్నికల్లోనూ టీడీపీ తిరుగులేని శక్తిగా ఉంది. మరి ఇంత కంచుకోటగా ఉన్న ఈ జిల్లాల్లో దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో టీడీపీ ఎదురు ఈదాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నేతల మధ్యే సఖ్యత లేకపోవడం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై పార్టీ క్యాడర్‌లోనూ, ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మార్పులు చేర్పులు తప్పేలా లేవు.
ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ…..
ఉదాహరణకు అనంతపురం సిటీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి అస్సలు పొసగడం లేదు. వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పుగా వాతావరణం ఉంది. వీరిలో ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ప్రభాకర్ చౌదరికి ఎలాగైనా ఎర్త్ పెట్టాలని జేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పల్లె రఘునాధ్ రెడ్డి సీటుపై హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కన్నేశారు. నిమ్మల కిష్టప్ప అటు పెనుగొండలో బీకే. పార్ధ సారధిని కూడా డిష్టర్బ్ చేస్తున్నారు. ఇక గురునాథ్ రెడ్డి కోసం జేసీ రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకి కంటిలో నలుసులా మారారు. మడకశిర ఎమ్మెల్యే కే.ఈరన్న సీటు కూడా సందిగ్దంలో ఉంది. కదిరి ఎమ్మెల్యే అత్తర్ చంద్ బాషాకు బదులుగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అయితేనే అక్కడ బలమైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు.
సిట్టింగ్ లను మార్చేస్తే……
ఇక కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరికి సీటు వస్తుందా ? లేదా ఆయన వారసుడు మారుతి రంగంలో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. హనుమంతరాయ చౌదరికి అయితే సీటు ఇచ్చేందుకు బాబు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కాల్వ శ్రీనివాసులను నియోజకవర్గం మారుస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక జిల్లాలో శింగనమల ఎమ్మల్యే యామినిబాల వికెట్ ఫస్ట్ లిస్ట్‌లోనే డౌన్ అవుతుందని తెలుస్తోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి బదులుగా ఆయన తనయుడు ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ కౌన్సెలర్‌గా ఉన్న అస్మిత్ రెడ్డిని రంగంలోకి దించాలని జేసీ బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ తిరిగి అక్కడే పోటీ చెయ్యడం కన్ఫామ్. చివర్లో ఏదైనా అనుకోని సమీకరణలు మారితే ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి కూడా బరిలో దిగే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా టీడీపీ కంచుకోటలో కొన్ని చోట్ల సమీకరణలు… మరి కొన్ని చోట్ల బాబు గారి ఈక్వేషన్లు… మరి కొన్ని చోట్ల ఇతరత్రా సమీకరణల నేపథ్యంలో కొంత మంది సిట్టింగ్‌లు అయితే అవుట్ అవనున్నారు.
Leave a Reply