అద్దంకిపై బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా?

ఏపీ రాజధాని అమ‌రావ‌తి విస్తరించి ఉన్న జిల్లా గుంటూరు… పొరుగు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా ? సమీకరణలు మారుతున్న పక్షంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తమ అదృష్ణాన్ని పరిక్షించుకోనున్నారా అంటే అవుననే స్పష్టం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయం తేల్చడం చంద్రబాబుకు ఓ పట్టాన అవ్వడం లేదు. ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాంకు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. వీరిద్దరూ నిప్పు ఉప్పుగా అక్కడ రాజకీయం చేస్తున్నారు.

ఇద్దరినీ సముదాయించలేక……

వచ్చే ఎన్నికల్లో వీరిలో ఎవరికి సీటు ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అక్కడ బలంగా ఉన్న గొట్టిపాటికే తిరిగి సీటు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నా బలరాం వర్గం సపోర్ట్‌ చేసే పరిస్థితి లేదు. దీంతో అద్దంకి విషయంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అద్దంకి రాజకీయాలు అలా వెడెక్కుతుంటే ఇటు గుంటూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం నరసారావుపేట ఎంపీగా ఉన్న సీనియర్‌ పార్లమెంటేరియ‌న్‌ రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో వ‌యోభారం దృష్ట్యా పోటీ చేసే ఛాన్సులు లేవు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంలో ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న రాయపాటి రంగారావుకు జిల్లాలో ఓ అసెంబ్లీ సీటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

నరసరావు పేట ఎంపీ స్థానాన్ని……

రాయపాటితో ఖాళీ అయ్యే నరసారావుపేట ఎంపీ సీటు నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావును పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇటు శిద్ధా రాఘవరావు పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపితే ఆయన తనయుడు సిద్ధా సుధీర్‌బాబుకు జిల్లాలో అసెంబ్లీ సీటు ఇవ్వనున్నారు. దర్శి లేదా పశ్చిమ ప్రకాశంలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి కూడా సుధీర్‌ పేరు పరిశీలనలో ఉంది. అదే టైమ్‌లో శిద్ధా రాఘవరావు అనుకోని కారణాల వల్ల లేదా ఇతర‌త్రా సమీకరణల వల్ల తిరిగి అసెంబ్లీకే పోటీ పడితే నరసారావుపేట పార్లమెంటు నుంచి గుంటూరు జిల్లా మంత్రి రంగంలో ఉంటార‌ని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రంగంలోకి దింపనున్నారు.

ఎవరో ఒకరిని……

చంద్రబాబు సైతం రాయపాటి ప్లేస్‌లో శిద్ధా రాఘవరావు లేదా ప్రత్తిపాటి పుల్లారావులలో ఎవరో ఒకరిని పోటీ చేయించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుల్లారావు నరసారావుపేట పార్లమెంటుకు పోటీ పడితే ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టుపాటి రవికుమార్‌ను చిలకలూరిపేట నుంచి పోటీ చేయించేలా లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు. గొట్టిపాటి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన కొన్ని సంవత్సరాలుగా చిలకలూరిపేటలోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు అక్కడ వ్యాపారాలతో పాటు నియోజకవర్గంలో బంధుగణం పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి.

గొట్టిపాటికి చిలకలూరిపేట ఇస్తే…..

దీనికి తోడు ఎమ్మెల్యేగా ఇప్పటికే మూడు సార్లు వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఆయన తిరుగులేని నేతగా ఉన్నారు. రవికి చిలకలూరిపేట రాజకీయాలు కూడా అనుభవం ఉన్నాయి. గతంలో ఆయన అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నా చిలకలూరిపేట కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా కూడా పని చేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వైసీపీలోకి జంప్ చేసిన‌ప్పుడు ర‌వి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కొద్ది రోజుల పాటు న‌డిపించారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న సమీకరణల బట్టి చూస్తే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, మంత్రి వచ్చే ఎన్నికల్లో ప్రకాశంను వదిలి గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. మరి ఈ సమీకరణలు ఎన్నికల వేళ‌ ఎలా మారతాయే చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 27856 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*