నో..బాండింగ్….అంటున్న బాబు….!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు సొంత జిల్లాపైనే దిగులుపట్టుకుంది. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, విభేదాలు తీవ్రంగా ఉండటంతో ఆయన తన సొంత జిల్లా అయిన చిత్తూరును చక్కపెట్టే పనిలో పడ్డారట. తొలుత చిత్తూరులో పార్టీని ఒక కొలిక్కి తెచ్చిన తర్వాతనే మిగిలిన జిల్లాల పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. ఈసారి తన సొంత జిల్లాలో పసుపు జెండాను ఎగురవేయాలన్నది చంద్రబాబు పట్టుదల. అయితే ఇందుకు నేతలు సహకరించాల్సి ఉంది. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయమూ లేదు. సఖ్యతా లేదు. సీట్ల కోస, కాంట్రాక్ట్ ల కోసం కొట్లాట తప్ప పార్టీని పట్టించుకోవడం మానేశారు.

గత ఎన్నికల ఫలితాలతో……

గత ఎన్నికల్లో కూడా చిత్తూరు జిల్లా చంద్రబాబునాయుడికి షాకిచ్చింది. ఉత్తరాంద్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా ఆధిక్యతను ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి నీరసపడింది. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఇది తనకు అప్పట్లో అవమానంగా భావించారు. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఈ నాలుగేళ్లలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలను నెలకొల్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

పార్టీని ప్రక్షాళించే దిశగా…..

కాని సొంత పార్టీలో నేతలు చిత్తూరు జిల్లాలో పార్టీని దెబ్బతీసే పరిస్థితుల కన్పిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రి పదవినుంచి తొలగించి వైసీపీ నుంచి వచ్చిన అమర్ నాధ్ రెడ్డిని మంత్రిని చేశారు. అమర్ నాధ్ రెడ్డి మంత్రిగా వచ్చినా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనించిన చంద్రబాబు తానే స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికలలో బలమైన నాయకులను రంగంలోకి దించాలని బాబు డిసైడ్ అయ్యారు. బంధువులు, స్నేహితులు, సెంటిమెంటు వంటివి చూడకుండా ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలన్నది బాబు ఆలోచన. అందుకే ఇప్పటి వరకూ ఇన్ ఛార్జిలు లేని చోట నియామకాలు వేగవంతంగా చేపడుతున్నారు.

వేగంగా కీలక నిర్ణయాలు…..

పీలేరు నుంచి ప్రారంభమైన చంద్రబాబు ఆపరేషన్ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నారు. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రావడంతో పార్టీకి బలం చేకూరినట్లే. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి పట్ల టీడీపీ క్యాడర్ సంతృప్తిగా లేరు. టీడీపీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని గల్లా పై ఆరోపణలున్నాయి. దీనికి తోడు గల్లా తనకు తానే స్వచ్ఛందంగా ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో అక్కడ చంద్రబాబు పులివర్తినానిని నియమించారు. అలాగే పుంగనూరులో బలమైన వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేందుకు మంత్రి అమర్ నాధ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. అమర్ నాధ్ రెడ్డికి ఈ నియామకం ఇష్టం లేకపోయినా చంద్రబాబు డెసిషన్ తీసేసుకున్నారు. నగరి నియోజకవర్గంలోనూ గాలి కుటుంబ సభ్యులతో చర్చించిన చంద్రబాబు కుటుంబంలో విభేదాలు పరిష్కరించుకోకుంటే వేరే వారికి టిక్కెట్ ఇస్తానని మొహం మీదే చెప్పేశారు. ఇలా వరుసగా చంద్రబాబు తనకు బాండింగ్ అంటూ ఏమీ లేదని గెలుపు గుర్రాలకే ఈసారి టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలో ఇన్ ఛార్జుల నియామకం జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 32319 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*